కేసీఆర్, డీజీపీలపై ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు 

కేసీఆర్, డీజీపీలపై ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు 

సంగారెడ్డిలో జరిగిన మైనార్టీ గర్జన సభ వేదికగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఓ బట్టేబాజ్ అని, జగ్గారెడ్డి అరెస్టైనట్లే .. కేసీఆర్ కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు. రాజకీయ కుట్రంలో భాగంగా జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. రాహుల్ సభ నిర్వహించాడనే కారణంతోనే అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. డీజీపీ మహేందర్ రెడ్డి అతి తెలివి చూపొద్దని.. కేసీఆర్‌కు చెంచాగిరి చేసుకోవాలని వ్యాఖ్యానించారు. 14 ఏళ్ల తరువాత అర్ధరాత్రి నోటీసులు లేకుండా జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారని అన్నారు. 2004లో నమోదైన పాస్‌పోర్ట్ కేసులో సీఐడీ స్టేట్‌మెంట్‌లో జగ్గారెడ్డి పేరే లేదన్నారు. సీఐడీ స్టేట్‌మెంట్‌లో కేసీఆర్, హరీష్ రావుల పేర్లు ఉన్నాయన్నారు. గుజరాతీ మహిళను తన భార్యగా చూపిస్తూ, హరీష్ రావు యూఎస్ ఎంబసీకి లేటర్‌ ఇచ్చారని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఎంపీ మధుసూదన్ రెడ్డి, కేసీఆర్ పీఏ అజిత్ రెడ్డిల పేర్లు నకిలీ పాస్‌పోర్ట్ కేసులో ఉన్నాయని ఉత్తమ్ అన్నారు. జగ్గారెడ్డి కుటుంబం వెంట కోటిమంది సైన్యం ఉందన్నారు. అక్రమ కేసులు పెడుతున్నవారి లిస్ట్‌ను తామూ తయారు చేస్తున్నామని అన్నారు. మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.