తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుపై ఉపరాష్ట్రపతి ఆరా..

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుపై ఉపరాష్ట్రపతి ఆరా..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... తన అత్తగారి దశదిన కార్యక్రమాల కోసం ఢిల్లీ నుంచి నెల్లూరు వెళ్లిన ఆయన.. ఢిల్లీ నుంచి రేణిగుంట వరకు విమానంలో అక్కడ నుంచి రైలు మార్గంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం చేరుకున్నారు. రైలులో ప్రయాణం చేసే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే ప్రాజెక్టుల గురించి అధికారులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రవాణా సౌకర్యాలు కీలకమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నూతన రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం ముందుకు సాగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు సూచించారు ఉపరాష్ట్రపతి. ముఖ్యంగా కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైను, నడికుడి - శ్రీకాళహస్తి రైలు మార్గం పనుల గురించి ప్రత్యేకంగా అధికారులతో చర్చించారు. ఇక గూడూరు - విజయవాడ మూడో లైను, గుంటూరు-అమరావతి-విజయవాడ రైల్వేలైను, గుంతకల్లు స్టేషన్, నెల్లూరు నూతన స్టేషన్లతో పాటు గూడూరు, రేణిగుంట స్టేషన్లలో వైఫై సౌకర్యం గురించి ఆరా తీశారు. మధ్య రైల్వే ప్రవేశపెట్టిన సువిధ డైనమిక్ ఫెయిర్ ట్రైన్స్ గురించి కూడా మాట్లాడారు. వీటిలో టిక్కెట్టు ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని, మధ్యతరగతికి సౌకర్య వంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

నెల్లూరు- కడప జిల్లాల మధ్య ముడిసరుకుల రవాణా, ప్రయాణ సౌకర్యాలు, కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులకు ఉద్దేశించిన కృష్ణపట్నం-ఓబుల వారి పల్లె రైల్వే లైన్ సొరంగం పనుల గురించి గతంలోనే రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ని తన ఛాంబర్ కు పిలిపించుకుని ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులపై ఆరా తీశారు ఉపరాష్ట్రపతి. ప్రస్తుతం ఆ పనుల గురించి మరో సారి ఉపరాష్ట్రపతి రైల్వే అధికారులతో చర్చించారు. ముందుగా తెలియజేసినట్లుగా ఫిబ్రవరి చివరి నాటికి పనులు పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలను కలుపుతూ, కడప-నెల్లూరు మధ్య ముడిసరుకుల రవాణా కోసం ఉద్దేశించిన ఈ ర్వైల్వే లైనును ప్రజా రవాణా కోసం కూడా అందుబాటులో తెచ్చేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకునే దిశగా ఆలోచించాలని ఉపరాష్ట్రపతి గతంలోనే రైల్వే మంత్రికి సూచించారు. ఈ విషయాన్ని అధికారులకు కూడా వివరించి, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న అన్ని రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.