ఆగస్టు నాటికి పోలవరం గ్యాలరీ పూర్తి

ఆగస్టు నాటికి పోలవరం గ్యాలరీ పూర్తి

జూన్ 11 నాటికి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే డయాఫ్రామ్ వాల్ పనులను పూర్తి చేస్తామన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పటికే 1271 మీటర్ల పని పూర్తి అయ్యిందని.. ప్రస్తుతం.. జెట్ గ్రౌటింగ్ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇంకా 2.95 కోట్ల కుబిక్ మీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం కాంక్రీటు పనులు శర వేగంగా సాగుతున్నాయన్నారు. అలాగే... పోలవరంలో గాలరీ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని...ప్రజల సందర్శనకు వీలుగా వీటిని పెడుతున్నట్లు వెల్లడించారు. ఇంకా స్పిల్ వేలో 22వ బ్లాక్ 17 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తి అయిందని దేవినేని ఉమ అన్నారు. 44 బ్లాకుల పని శరవేగంగా సాగుతోందని తెలిపారు. స్పిల్ వేపై తొలి గేటును ఏర్పాటు చేసే అంశాన్ని వచ్చే వారం ప్రకటిస్తామన్నారు. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘానికి ఎప్పటికప్పుడు డిజైన్లు ఇతర సమాచారాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 8 వేల 612 మంది రైతులు పోలవరం ప్రాజెక్టును సందర్శించారని వెల్లడించారు. 7 లక్షల 15 వేల ఫార్మ్ పాండ్స్ తవ్వామని... దేశంలో ఇదో రికార్డుగా దేవినేని ఉమ వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 180కోట్లతో నిర్మిస్తున్న బొంతురంగ సాగరం ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు 15 తేదీన శంకుస్థాపన చేస్తారని తెలిపారు.