విదర్భదే రంజీ టైటిల్

విదర్భదే రంజీ టైటిల్

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక 'రంజీ ట్రోఫీ'ని వరుసగా రెండోసారి విదర్భ జట్టు కైవసం చేసుకుంది. విదర్భతో గురువారం నాగ్‌పూర్ వేదికగా ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర 127 పరుగులకే ఆలౌటైంది. దీంతో విదర్భ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. విదర్భ ఆటగాడు ఆదిత్య సర్వాటె రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదేసి వికెట్లతో.. మొత్తం 11 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు ఇచ్చి 5 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.

ఆదివారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు మొదటి ఇన్నింగ్స్‌‌లో 312 పరుగులకి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర 307 పరుగులు చేసింది. విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 206 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ముందుంచింది. లక్ష్య ఛేదనలో స్పిన్నర్ల ధాటికి సౌరాష్ట్ర 127 పరుగులకే ఆలౌలైంది. సౌరాష్ట్ర స్టార్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 1, 0 పరుగులకే పెవిలియన్ చేరడంతో.. సౌరాష్ట్ర కోలుకోలేకపోయింది.