రివ్యూ: వినయ విధేయ రామ

రివ్యూ: వినయ విధేయ రామ

నటీనటులు : రామ్ చరణ్, కైరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ 

సంగీతం :  దేవి శ్రీ ప్రసాద్ 

సినిమాటోగ్రఫి :  రిషి పంజాబీ, ఆర్థర్ ఏ విల్సన్ 

నిర్మాత : డివివి దానయ్య 

దర్శకత్వం : బోయపాటి శ్రీను 

'రంగస్థలం' లాంటి భారీ విజయం తరవాత రామ్ చరణ్ చేసిన మాస్ ఎంటర్టైనర్ 'వినయ విధేయ రామ'.  మాస్ ప్రేక్షకుల కోసమే ఒక సినిమా చేయాలని నిర్ణయించుకుని చేసిన సినిమా ఇది.  యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.. 

కథ : 

అన్నదమ్ముల్లో చిన్నవాడైన రామ్ (రామ్ చరణ్) అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం.  రామ్ కూడ అందరినీ వాళ్ళ కోసం ఏమైనా చేసేంతలా ప్రేమిస్తూ ఉంటాడు.  ఆ సమయంలోనే ఎలక్షన్ కమీషనర్ అయిన రామ్ అన్నయ్య (ప్రశాంత్)కు పందెం పరశురామ్ (ముఖేష్ రిషి)కి గొడవ జరుగుతుంది.  రామ్ కుటుంబంపై పగ తీర్చుకోవడానికి పరశురామ్ బీహార్లో ఉండే మున్నాభాయ్ (వివేక్ ఒబెరాయ్)ను తీసుకొస్తాడు.  అలా తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన మున్నాభాయిని రామ్ ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా.   

విశ్లేషణ :  

ఒకవైపు రామ్ చరణ్.. ఇంకోవైపు బోయపాటి.. ఈ కాంబినేషన్ విన్న ఎవరైనా మొదటగా ఊహించేది హెవీ యాక్షన్ ఎంటర్టైనర్.  ఆ ఊహలకు తగ్గట్టుగానే సినిమాలో బోలెడంత.. కాదు అవసరానికి మించిన యాక్షన్ కంటెంట్ ఉంది.  బోయపాటి తనదైన స్టైల్లో చరణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు.  ఫస్టాఫ్ మొత్తం కుటుంబం, హీరో హీరోయిన్ల ప్రేమ తాలూకు సన్నివేశాలతో, ఫైట్లతో సాగిపోయి మంచి విరామం కలిగి ఉంటుంది.   అంతవరకూ బాగానే ఉన్నా ద్వితీయార్థంలో కూడ ఏవ్ ఎలిమెంట్స్ ఉంది ఉంటే బాగుండేది.  ఇంటర్వెల్ తరవాత అస్సలు సమయం వృధా చేయకుండా సినిమాను ఫైట్ల మధ్యలోకి లాక్కెళ్లిపోతాడు బోయపాటి.  అక్కడి నుండి అన్నీ పోరాటాలు, రక్తపాతాలే.  అప్పటి వరకు అలరించిన కుటుంబం కానీ, లవ్ ట్రాక్ కానీ కనబడవు.  దీంతో అభిమానులు ద్వితీయార్థాన్ని ఎంజాయ్ చేయగలిగినా సాధారణ ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేరు.  పైగా యాక్షన్ సన్నివేశాల్లో కొన్ని ఇలా కూడ జరుగుతుందా అనేలా ఉంటాయి.  ఫైట్స్ మధ్యలో వచ్చే పాటలు అప్పుడప్పుడూ కొంత రిలాక్స్ అవడానికి టైమ్ ఇస్తాయి.  

నటీనటుల పనితీరు : 

చెర్రీని మాస్ అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో అలానే ఉంటాడు ఈ సినిమాలో.  హెవీగా బిల్డప్ చేసిన సిక్స్ ప్యాక్ బాడీ ఆయన్ను కొంత భిన్నంగా, వైల్డ్ గా ప్రెజెంట్ చేసింది.   కుటుంబ సన్నివేశాల్లో కూడ తన నటనతో ఆకట్టుకున్నాడు.  ఇక పాటల్లో అతని డాన్సులు కనువిందు చేస్తాయి.  హీరోయిన్ కైరా అద్వానీ పాత్రకు ఏమంత ప్రాధాన్యం లేకపోవడంతో ఆమె పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు.  హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా సినిమాను రక్తి కట్టించాడు.  ఇక ప్రశాంత్, స్నేహ లాంటి నటీ నటులంతా తమ తమ పాత్రల మేర బాగానే నటించారు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

బోయపాటి ఎప్పటిలాగే యాక్షన్, ఫ్యామిలీ ఫార్ములాను నమ్ముకునే ఈ కథ రాసుకున్నాడు.  మొదటి అర్ధభాగం అలరించింది.  ద్వితీయార్థంలో కూడా యాక్షన్ తో పాటే ఫ్యామిలీ ఎమోషన్ ఉండి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.  ఇక చరణ్ ను ఎలివేట్ చేయడంలో బోయపాటి పూర్తిగా సక్సెస్ అయ్యాడు.   సినిమా చూసిన వాళ్ళు  చరణ్ ఎలా ఉన్నాడనే ప్రశ్నకు చాలా మాస్ మామ అని సమాధానం ఇస్తున్నారు.   ఆర్థర్ ఏ విల్సన్, రిషి పంజాబీల సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.  స్టంట్ కొరియోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ.   చిత్ర నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. 

పాజిటివ్ పాయింట్స్ : 

యాక్షన్ సన్నివేశాలు

ఫస్టాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ 

రామ్ చరణ్ మాస్ పెర్ఫార్మెన్స్, డాన్సులు 

నెగెటివ్ పాయింట్స్ : 

ద్వితీయార్థంలో లోపించిన ఎమోషన్ 

యాక్షన్ కంటెంట్ మరీ ఎక్కువ కావడం 

చివరిగా : చాలా మాస్ మామ