విరాట్‌ బ్రాండ్ విలువ రూ.1200 కోట్లు

విరాట్‌ బ్రాండ్ విలువ రూ.1200 కోట్లు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లోనే కాదు బ్రాండ్ విలువలోనూ తనదైన ముద్ర వేసారు. వరుసగా రెండో ఏడాది దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిచారు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుని.. గ్లోబల్‌ వాల్యుయేషన్, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సలహాదారు సంస్థ 'డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్' నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో 18 శాతం పెరుగుదలతో.. 2018లో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం కోహ్లి బ్రాండ్‌ విలువ దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు). కోహ్లి గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు.

ఈ జాబితాలో కోహ్లీ తరవాత బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఉన్నారు. 21 ఉత్పత్తులను ఎండార్స్‌ చేస్తున్న దీపికా బ్రాండ్‌ విలువ రూ.718 కోట్ల (102.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు). బ్రాండ్ల ద్వారా వచ్చే సంపాదన 100 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నది వీరిద్దరే. వీరి తర్వాతి స్థానాల్లో బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (రూ.473 కోట్లు), రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.443 కోట్లు)లు ఉన్నారు. 2017లో రెండో స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ ఐదో స్థానానికి పడిపోయాడు. 20 సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో క్రీడల నుండి విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, పీవీ సింధు ఉన్నారు.