డెబిట్ కార్డుల ఫీజు తగ్గించిన వీసా

డెబిట్ కార్డుల ఫీజు తగ్గించిన వీసా

దేశంలో డెబిట్ కార్డు చెల్లింపులను మరింత పెంచేందుకు వీసా సంస్థ సంచలన నిర్ణయం తీసుకొంది. జూలై 1 నుంచి దేశీయంగా జరిపే డెబిట్ కార్డు చెల్లింపులపై ఫీజును భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. డెబిట్ కార్డు లావాదేవీలపై 95% వరకు ఫీజు తగ్గిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ. 2,000లోపు చెల్లింపులపై ఈ తగ్గింపు భారీగా ఉండనుంది. పెద్ద సంఖ్యలో చిన్న వ్యాపారులు, వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. 

ఇప్పటి వరకు చెల్లింపు మొత్తంతో సంబంధం లేకుండా లావాదేవీకి రూ. 2.99 చొప్పున బ్యాంకులు వసూలు చేసేవి. వీసా సంస్థ తాజా నిర్ణయంతో రూ.2,000 లోపు లావాదేవీలపై 15 పైసలు మాత్రమే అదనపు చార్జీలు పడతాయి. అంతకంటే ఎక్కువ మొత్తానికి రూ.1.50 వరకు చెల్లించాల్సి వస్తుంది. వ్యాపారులు కూడా రూ. 2000లోపు మొత్తానికి 45 పైసలకు బదులు 15 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. వినియోగదారులు, వ్యాపారులలో డిజిటల్ పేమెంట్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు డేటా ప్రాసెసింగ్ ఫీజు తగ్గిస్తున్నట్టు వీసా తన సభ్య బ్యాంకులకు విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ పేమెంట్ మౌలిక వసతుల కల్పనకు ఫీజు తగ్గింపు దోహదపడుతుందని వీసా చెప్పింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రూపే కార్డు నుంచి గట్టి పోటీ ఎదురవడమే వీసా తాజా నిర్ణయానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీసా అందించే సేవలకు రూపే చౌకగా అందిస్తుండటంతో మార్కెట్ పై తన పట్టు నిలబెట్టుకొనేందుకు వీసా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెబుతున్నారు. తాజాగా క్రెడిట్ కార్డుల విభాగంలోకి ప్రవేశించిన రూపే, వీసా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది. చాప కింద నీరులా వీసా సర్వీస్ ఫీజును మాత్రం పెంచేసింది. ఇన్నాళ్లూ ట్రాన్సాక్షన్ మొత్తంలో 0.035% సర్వీస్ ఫీజుగా వసూలు చేసిన వీసా, దానిని 0.055%కి పెంచింది.