వాషింగ్టన్ స్టేట్ లో మరింత హిమపాతం

వాషింగ్టన్ స్టేట్ లో మరింత హిమపాతం

అమెరికాలో సిలికాన్ సిటీగా పేరొందిన సియాటిల్ నగరం గత 70 ఏళ్లలో ఫిబ్రవరి నెలలో ఎన్నడూ చూడనంత హిమపాతాన్ని చూస్తోంది. ఈ వారం కూడా భారీగా మంచు పడనున్నట్టు నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. పశ్చిమ మధ్య వాషింగ్టన్ లో 1-3 అంగుళాల మంచు కురవనుంది. కొన్ని ప్రాంతాలలో ఇది మరింత ఎక్కువగా ఉండనుంది. 

శనివారం సియాటిల్ ప్రాంతంలో 10 అంగుళాలకు పైగా హిమపాతం కురిసింది. ఇది సాధారణంగా ఏడాదంతా కురిసే మంచు కంటే ఎక్కువ. ఈ ప్రాంతంలో సోమవారం రోజంతా మంచు కురవవచ్చని వాతావరణ శాఖ అంచనా. ఆ తర్వాత ఘనీభవన వర్షం, వర్షం లేదా వడగళ్ల వాన పడవచ్చని చెప్పింది. ఇక దక్షిణ వాషింగ్టన్ లోని సెలయేళ్లలో సోమవారం 36 అంగుళాల మందాన మంచు పడనుంది. అయితే ఈ వారం మధ్య నుంచి క్రమంగా వెచ్చని వాతావరణం ఏర్పడనున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.

మంచుతో నిండిన రోడ్లు, సరిగా కనిపించని కారణాల వల్ల రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాలలో సోమవారం ప్రయాణం అత్యంత కష్టసాధ్యం నుంచి అసాధ్యమని చెబుతున్నారు. డ్రైవర్లు నెమ్మదిగా నడపాలని వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌ మెంట్ సూచించింది. శనివారం నుంచి ప్రయాణించే పరిస్థితులు లేవు. రహదారులు దుస్సాధ్యంగా మారడంతో వందలాది డ్రైవర్లు వాషింగ్టన్ హైవేపై నిలిచిపోయారు.

సియాటిల్, టకోమా, ఒలింపియాలలోని పబ్లిక్ స్కూళ్లలో తరగతులను సోమవారం రద్దు చేశారు. రాష్ట్ర శాసనసభ కూడా మూతపడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ది కింగ్ కౌంటీ మెట్రో రవాణా సేవలు మంగళవారం వరకు తక్కువ దూరాలు తిరుగుతాయి. మంచు తొలగించిన మార్గాల్లో మాత్రమే రోడ్లపై రవాణా సేవలు అందించనుంది. సియాటిల్ మోనోరైల్ కూడా తాము సోమవారం యధావిధిగా ఉదయం 7.30కి పని ప్రారంభించమని..వాతావరణ పరిస్థితులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.