ఇంత హడావిడిగా ఫ్రాన్స్ పర్యటన ఎందుకు?

ఇంత హడావిడిగా ఫ్రాన్స్ పర్యటన ఎందుకు?

రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అత్యవసరంగా మూడు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆమె పర్యటనలో దసాల్ట్ ఏవియేషన్ ఫ్యాక్టరీని ఎందుకు చేర్చాల్సి వచ్చిందని రాహుల్ నిలదీశారు. రాఫెల్ కాంట్రాక్ట్ దక్కించుకొనేందుకు రిలయన్స్ డిఫెన్స్ ను భాగస్వామిగా చేర్చుకోవాల్సి వచ్చిందని దసాల్ట్ డిప్యూటీ సీఈవో చెప్పినట్టు ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఉటంకించారు. దీంతో రాఫెల్ ఫైటర్ల కొనుగోలుకి రిలయన్స్ భాగస్వామ్యం పరిహారం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

అనిల్ అంబానీ ఎప్పుడూ ఒక విమానం తయారు చేయలేదు. ఒప్పందానికి 10 రోజుల ముందు ఆయన కంపెనీ స్థాపించారు. వెంటనే ప్రధానమంత్రి అంబానీ జేబులో రూ.30,000 కోట్లు పెట్టారని రాహుల్ విమర్శించారు. ఆయన అంబానీకి ప్రధాని తప్ప భారతదేశానికి కాదని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంపై వార్తలు రాకుండా మీడియాపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ప్రభుత్వం పెడచెవిన పెట్టడం చూస్తుంటే ఇందులో అవినీతి జరిగిందని స్పష్టమవుతోందని చెప్పారు. ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించాల్సిందిగా భారత ప్రభుత్వం దస్సాల్ట్ పై విపరీతమైన ఒత్తిడి తెస్తోందన్నారు.