కన్నా... రిజర్వేషన్ ఎందుకు అడగలేదు...

కన్నా... రిజర్వేషన్ ఎందుకు అడగలేదు...

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కన్నా లక్ష్మీనారాయణ... ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి ఆయన ఓ వినతి పత్రం అందజేశారు... ఇప్పుడు కన్నా నివేదికను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు... కన్నా నివేదికపై స్పందించిన ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... ప్రధానికి కన్నా ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదాను ఎందుకని చేర్చలేదని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల విషయాన్ని కన్నా గాలికి వదిలేశారని విమర్శించారు యనమల రామకృష్ణుడు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది... దానిని వెంటనే ఆమోదించాలని కన్నా ఎందుకని ప్రధానిని కోరలేదని ప్రశ్నించారు మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని కన్నా వినతిపత్రం స్పష్టం చేస్తోందన్నారు. ఇక పోలవరం, అమరావతిని వైఎస్ జగన్ సినిమాలతో పోల్చడం బాధ్యతారాహిత్యం అన్నారు. పోలవరం, అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల ద్వారా తన అవివేకాన్ని వైఎస్ జగన్ బైట పెట్టుకున్నారంటూ సెటైర్లు వేశారు యనమల.