తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం

తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం

వైసీపీ అధికారంలోకి వస్తే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం తెస్తానని  ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా చిలకపాలెంలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే 75శాతం ఉద్యోగాల్లో స్థానికులనే నియమించుకునేలా లోకల్ రిజర్వేషన్ తెస్తానని వెల్లడించారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కళా వెంకట్రావ్ కాదు.. కాసుల వెంకట్రావ్ అన్నారు.  చంద్రబాబు తరఫున ఇతరపార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బ్రోకర్ అని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రైతులను మోసం చేసేందుకు బాబుకి తోటపల్లి ప్రాజెక్టు గుర్తొచ్చిందని తెలిపారు.

ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఉపాధి లేక మత్స్యకారులు గుజరాత్ కు వలస వెళ్లి బంధీలుగా మారుతున్నారని తెలిపారు.  ఏపీలో సమస్యలు పట్టించుకోని చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాడని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.  ఏపీలో ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ , పీవీ ఎక్స్ ప్రెస్ హైవే కట్టింది ఎవరో తెలుసా చంద్రబాబు అన్నారు. పిట్టలదొరలా మాటలు చెప్పే బాబుని ప్రజలు నమ్మబోరని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని తెలిపారు.  చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చి విశ్వసనీయత పెంచుతానని పేర్కొన్నారు. పింఛన్ వయసు 60 నుంచి 55 ఏళ్లకు తగ్గిస్తానని తెలిపారు.  ప్రతీనెలా 2 వేలు పింఛన్ ఇస్తాని జగన్ పేర్కొన్నారు.