బజ్జీల్లా భూములు తింటున్నాడు

 బజ్జీల్లా భూములు తింటున్నాడు

వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర ఈరోజుతో 2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది.  ఈ సందర్భంగా ఏలూరు పాతబస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ మోట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పాలనను దుమ్మెత్తిపోశారు. సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని ఆయన తెలిపారు. 

ప్రజలు ఆశీస్సులు, వారి చూపించే ప్రేమతో 2వేల కిలోమీటర్లు నడవగలిగానని వెల్లడించిన ఆయన బాబు అవినీతి పాలన అంతమయ్యే రోజులు దగ్గరబడ్డాయన్నారు. 'రాష్ట్రానికి ఏదో చేస్తారని.. 15కు 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారు పశ్చిమగోదావరి ప్రజలు. కానీ నాలుగేళ్లుగా ఇసుక నుంచి బొగ్గుదాకా, గుడి భూముల నుంచి గుడిలో లింగం దాకా అన్నింటినీ మింగేస్తూ చంద్రబాబు జనం గుండెల్లో గునపాలు దింపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు తొలి అడుగు పడింది ఈ జిల్లాలోనే. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడిచేశాడు. ఈ జిల్లా నుంచే దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేసుకున్నారు. ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్లు, మంత్రుల నుంచి చినబాబు దాకా అంతా లంచాలమయం. ఈ దొంగలబండికి నాయకుడు పెదబాబు అయిన చంద్రబాబు నాయుడు' అని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. 161వరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ లో జగన్ ప్రసంగించి చంద్రబాబు పాలనను దుయ్యబట్టారు.