వరల్డ్ కప్ లో జట్టుకి ధోనీ ఎంతో కీలకం

వరల్డ్ కప్ లో జట్టుకి ధోనీ ఎంతో కీలకం

ఐసీసీ వరల్డ్ కప్ 2011 విజయంలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలకపాత్ర మరువలేనిది. రాబోయే వరల్డ్ కప్ లో భారత జట్టుకి మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం అత్యావశ్యకమని అంటున్నాడు యువీ. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ధోనీ మార్గదర్శకుడిగా వ్యవహరించడంతో పాటు మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడన్నాడు. ధోనీ ఫామ్ కారణంగా జట్టులో చోటు దక్కడం అనుమానమేననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీలు మాత్రం మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడంలో ధోనీకి ఉన్న అపార ప్రతిభ కారణంగానైనా అతనిని ప్రపంచ కప్ జట్టుకి ఎంపిక చేయాలంటున్నారు.

మాహీకి ఉన్న క్రికెట్ పరిజ్ఞానం అమోఘమని చెప్పాడు 2011 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచిన యువరాజ్. సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు వికెట్ కీపర్ గా నిలవడం అతనికి ఉన్న బలమని తెలిపాడు. కొన్నేళ్లుగా ఈ పనిని ధోనీ సమర్థంగా నిర్వర్తిస్తున్నాడని యువీ గుర్తు చేశాడు. అతనో మంచి కెప్టెన్. యువ ఆటగాళ్లకు విరాట్ కి చక్కగా మార్గదర్శనం చేస్తాడన్నాడు. ‘జట్టు నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ ఉండటం చాలా అవసరం. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేల్లో అతనెలా ఆడాడో చూశాం. అతను తన సహజశైలిలో బంతిని బాదాలని’ యువీ సూచించాడు. మాహీ ఏ స్థానంలో బ్యాటింగ్ కి దిగాలన్న ప్రశ్నకు ఏ స్థానంలో ఆడాలో అతనికే వదిలేయాలని చెప్పాడు.