డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ దిశగా జొమాటో

డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ దిశగా జొమాటో

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో విస్తరణ బాట పట్టింది. భారత్ లో డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే దిశగా లక్నోకి చెందిన స్టార్టప్ టెక్ ఈగిల్ ఇన్నోవేషన్స్ ను కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందో వెల్లడించలేదు.

లక్నోకి చెందిన స్టార్టప్ టెక్ ఈగిల్ ఇన్నోవేషన్స్ ప్రత్యేకంగా డ్రోన్ల వినియోగంపై పనిచేస్తోంది. ఇకపై ఈ స్టార్టప్ హైబ్రిడ్ మల్టీ-రోటార్ డ్రోన్ల ద్వారా హబ్-టు-హబ్ డెలివరీ నెట్ వర్క్ ఏర్పాటు చేయడానికి కృషి చేయనున్నట్టు జొమాటో ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి మాత్రం కంపెనీ తెలియజేయలేదు.

‘ప్రస్తుతం మేం ఆకాశమార్గ అవిష్కరణల ప్రాథమిక దశలో ఉన్నాం. రేపు ఆన్ లైన్ లో ఆహారం ఆర్డర్ చేసిన యూజర్లకు డ్రోన్ ద్వారా అందజేసే దిశగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నామని‘ జొమాటో వ్యవస్థాకుడు, సీఈవో దీపీందర్ గోయల్ చెప్పారు. భవిష్యత్తులో ఎక్కడ ఉన్నవారికైనా రోబోలు అందజేయడం ఖాయమని, అందువల్ల ఆ దిశగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం ఎంతో కీలకమని గోయల్ అన్నారు. 

ప్రస్తుతం ఫుడ్ డెలివరీ వ్యాపారం ద్వారా కంపెనీకి 65% ఆదాయం వస్తున్నట్టు జొమాటో తెలిపింది. తమకు దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 75,000 రెస్టారెంట్ భాగస్వాములు ఉన్నట్టు చెప్పింది.