అయ్యవార్లకు ఆఖర్లో ఐ ఫోన్ పై ఆశ...

అయ్యవార్లకు ఆఖర్లో ఐ ఫోన్ పై ఆశ...

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ముసాయిదా బ‌డ్జెట్‌ కు జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఆమోదం తెలిపింది. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న నిన్న స‌మావేశ‌మైన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపిందిరు.. ఇక‌, జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సర ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదనలలో ఒకటి మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారింది. నగర ప్రజలు నానా ఇబ్బందులు పడి పన్నులు కడుతుంటే, జీహెచ్‌ఎంసీ అధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆ డబ్బుతో షోకులు చేస్తున్నారు.  తమ అధికార దర్పం కోసం ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా వాడుకుంటున్నారనే దానికి తాజా నిర్ణయమే తార్కాణంగా కనిపిస్తోంది. పారిశుద్యానికి, రోడ్ల మరమ్మతులకు నిధులు లేవంటూ కధలు చెప్పే అయ్యవార్లు తమ ఆర్బాటాలకు  ఏ మాత్రం లోటు రాకుండా చూసుకుంటున్నారు. 

అధికారులతో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా అదే తీరును కనబరుస్తుండటంతో సమస్యలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడంటున్నారు నగర ప్రజలు. నిన్న 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,600 కోట్ల బడ్జెట్ ను ప్ర‌తిపాదించారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐఫోన్ లు కావాలని పట్టుబట్టినట్టు సమాచారం. పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఐ ఫోన్ల పై ఆశ పుట్టుకు వచ్చింది. స్టాండింగ్ కమిటీలో ని 7 మంది మొన్నటి ఎన్నికల్లో ఒడిన వారే కావడంతో తమకు మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో ఐ ఫోన్ లు కావాలంటూ ప్రతిపాదనలు పెట్టి దానిని అప్రోవ్ కూడా చేసుకున్నారు. దీంతో ఐఫోన్ 12 ప్రో 512GB సామర్థ్యం కలిగిన 17 ఫోన్ లను కొనుగోలు చేయాలని స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనల్లో పంపించారు అధికారులు.

 మొత్తం 27,23,740 రూపాయల ఖర్చు అవుతుందని అంచనా రూపొందించారు. అయితే మార్కెట్లో స్టాక్ లేకపోవడంతో కొనుగోళ్లను వాయిదా వేసింది  జిహెచ్ఎంసి సంస్థ. మరో నెల 15 రోజుల్లో పాలక మండలి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఐఫోన్ల కోసం స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు చెప్పడం లో హాట్ టాపిక్ అయ్యింది. జనాలు కట్టే సోమ్ములకు గతుకులు లేని రోడ్లు కూడా వేయడం చేత కాదు కానీ వాళ్ళ సొమ్ముని తినడానికి సిగ్గుండాలి అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులుగా గంధం జోత్న్స, మీర్ బాసిత్ అలీ, సామ స్వ‌ప్న‌, మిర్జా ముస్త‌ఫా బేగ్‌, సున్నం రాజ్‌మోహ‌న్‌, మహ్మద్ నజీరుద్దీన్, ముఠా ప‌ద్మ‌న‌రేష్‌, కొల‌ను ల‌క్ష్మి, వి.సింధు, స‌బితా కిషోర్‌, ఏ.అరుణ, లాంటి వాళ్ళు ఉన్నారు. 2018లో కూడా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు కొత్త వాహనాలు తీసుకోవాలని అందుకు 3 కోట్ల నిధులను కేటాయించుకున్న ఘటన కూడా జనాల్లో బాగా వివాదాస్పదం అయింది.