ఆ బిచ్చగాడు లక్షాధికారి...కానీ !

ఆ బిచ్చగాడు లక్షాధికారి...కానీ !

 

రాజమండ్రిలో చనిపోయిన ఓ బిక్షగాడి దగ్గర లక్షా 83వేల రుపాయాల నగదును గుర్తించారు అక్కడి పోలీసులు. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం దగ్గర బిక్షాటన చేసుకునే 76 ఏళ్ల అనాథ వృద్దుడు ఈ తెల్లవారు జామున కన్నుమూశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని తరలించే సమయంలో ఆయన దగ్గరున్న సంచుల్లో ఈ నగదు బయటపడింది.

ఆలయ నిర్వాహకుల సమక్షంలో పోలీసులు ఈ మొత్తాన్ని లెక్కించారు. ఆ బిక్షగాడి డబ్బు నుంచే 3వేలతో అతని అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులు మిగిలిన డబ్బును పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వృద్ధుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అనే విషయం తేలాల్సి ఉంది. బతికినంత కాలం రూపాయి రూపాయి కూడబెట్టి దాదాపు రెండు లక్షలు కూడబెట్టిన ఆయన వాటిని అనుభవించకుండానే పోయాడని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు.