దిశ కేసు...నిందితులకి 10 రోజుల కస్టడీ

దిశ కేసు...నిందితులకి 10 రోజుల కస్టడీ

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితులను పోలీసుల కస్టడీకి అప్పగించింది కోర్టు. ఇంకా విచారణ జరపాల్సి ఉందన్న పోలీసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కోర్టు నిందితులకు 10 రోజుల కస్టడీని విధించింది. దిశ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసంర ఉందని నిందితుల కస్టడీ కోరుతూ... షాద్‌నగర్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా... నిందితుల దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసు కోవాల్సిఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. దిశ కేసులో నిందితులను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించే రోజు వేలాది మంది పోలీస్ స్టేషనుకు చేరుకోవడంతో నిందితుల నుంచి పూర్తి వివరాలు తీసుకోలేదని తెలిపారు. అందువల్ల నిందితులను పది రోజులు కస్టడీకి అనుమతి ఇస్తే వారిని మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు పోలీసులు. ఘటనలో మిస్సయిన మొబైల్ ఫోన్ రికవరీ చేయాల్సి ఉందని.. అదే విధంగా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చెయ్యాల్సి ఉందని పిటిషన్‌లో వెల్లడించారు.

దిశ హత్యాచారం కేసులో విచారణ ఖైదీలుగా చర్లపల్లి జైలులో ఉన్న నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, శివ, నవీన్‌ చెన్నకేశవులుకు సింగిల్‌ సెల్‌లో ఉంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు  చేశారు. వారి ఆరోగ్య పరిస్థితులను జైలు వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నిందితులపై జైలు లోపల ఇతర ఖైదీల నుంచి ఎలాంటి దాడులు జరగకుండా  అధికారులు ఎనిమిది మంది వార్డర్లను, ఇద్దరు హెడ్‌ వార్డర్లను ప్రత్యేకంగా నియమించారు. శనివారం రాత్రి నిందితుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి మహనది బ్లాక్‌లోని సింగిల్‌సెల్‌లను కేటాయించారు. దీన్ని నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు జైలు అధికారులు. నేరం చేశామనే బావన నిందితుల్లో ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు అధికారులు. భోజన విరామ సమయంలో నలుగురిని జైలు వరండాలో అటూ ఇటూ తిప్పి నిందితుల కదలిక గురించి పరిశీలించారు. వారిలో మార్పులు కానీ, ముఖంలో భావోద్వేగాలు కానీ కనిపించలేదని  తెలిపారు జైలు సిబ్బంది.