బ్రేకింగ్: బీజేపీ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు..

బ్రేకింగ్: బీజేపీ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు..

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకాంగా ఒకే సారి 10 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ గూటికి చేరుకున్నారు.. సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళే బీజేపీ కండువాలు కప్పుకున్నారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, రామ్‌మాధవ్‌ సమక్షంలో.. బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌లో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎస్‌డీఎఫ్‌ ఎమ్మెల్యేలు. ఇక, 10 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరడంతో సిక్కిం మాజీ సీఎం, ఎస్‌డీఎఫ్‌ అధినేత పవన్‌ కుమార్‌ ఛామ్లింగ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిక్కింకు సీఎంగా పనిచేసిన పవన్ కుమార్.. భారతదేశంలో ఎక్కువ కాలం సేవలు అందించిన ముఖ్యమంత్రులల్లో ఒకరు. ఆయన నాయకత్వంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ గణనీయమైన మెజారిటీతో పదేపదే అసెంబ్లీ ఎన్నికలలో గెలుస్తూ వచ్చింది. తాజాగా  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ 15 స్థానాల్లో గెలువగా, సిక్కిం క్రాంతికరి మోర్చా(ఎస్‌కేఎమ్‌) 17 స్థానాల్లో గెలిచింది. దీంతో అధికారాన్ని కోల్పోయారు పవన్ కుమార్. తాజా పరిణామంతో ఆయన పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు పడిపోయింది. ప్రస్తుతం సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్‌కేఎమ్‌ ఎన్డీయేలో కొనసాగుతోంది.