మోడీ మీడియా సమావేశం.. అంతా తూచ్!!

మోడీ మీడియా సమావేశం.. అంతా తూచ్!!

ఏప్రిల్ 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో తన మొట్టమొదటి మీడియా సమావేశం నిర్వహిస్తారని వచ్చిన వార్తలు ఉత్త పుకార్లేనని బీజేపీ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 26న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో నామినేషన్ వేసిన తర్వాత ప్రధాని మోడీ తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారనే వార్తలతో సోషల్ మీడియా హోరెత్తింది. 

ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12.30 గంటలకు మోడీ విలేకరులతో మాట్లాడతారని, ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్ట్ లిజ్ మాథ్యూ ఇది '110% ఫేక్ న్యూస్' అని బీజేపీ వర్గాలు చెప్పినట్టు ట్వీట్ చేశారు. 'ప్రధాని మోడీ ఏప్రిల్ 26న వారణాసిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారనే వార్తలను ఖండిస్తూ బీజేపీ నేత "ఇది 110% తప్పు వార్త" అని చెప్పారు. అలాంటి ప్రణాళికేం లేదని ఆ నేత తెలిపారు' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనతో కనీసం 15 నిమిషాల్లో చర్చలో పాల్గొనాలని మోడీకి సవాలు విసిరిన కొన్ని రోజుల తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. క్లిష్టమైన, ఇబ్బందికర ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని మోడీ తన పదవీ కాలంలో కనీసం ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. ఇలా చేసిన మొట్టమొదటి భారత ప్రధానిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారు. 

మోడీ తరచుగా తనను సమర్థించే టీవీ ఛానెళ్లకు మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బుధవారం ప్రధాని, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే తన పాపులారిటీతో ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సాయపడుతున్నాడని అక్షయ్ విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.