పశ్చిమ బెంగాల్ లో 119 మంది డాక్టర్ల రాజీనామా

పశ్చిమ బెంగాల్ లో 119 మంది డాక్టర్ల రాజీనామా

డాక్టర్ల సమ్మె కారణంగా పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు 28 మంది రోగులు మరణించారు. మృతులలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ డాక్టర్లు తమ సమ్మె కొనసాగిస్తున్నారు. డాక్టర్లు పని చేసేందుకు నిరాకరిస్తున్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రులలో డయాలసిస్ సౌకర్యం కూడా నిలిచిపోయింది. రోగులకు ఆక్సిజన్ కూడా ఇవ్వడం లేదు. 

మమత ప్రభుత్వంపై ఆగ్రహించిన డాక్టర్లు రాజీనామాల బాట పట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 119 మందికి పైగా డాక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటి దాకా డార్జిలింగ్, ఉత్తర పరగణ, ఎన్ఆర్ఎస్ కాలేజీలో 100 మందికి పైగా డాక్టర్లు రాజీనామా ఇచ్చారు. కోల్ కతాలో 80 మందికి పైగా డాక్టర్లు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

పెద్ద సంఖ్యలో డాక్టర్ల రాజీనామాల తర్వాత సమ్మెకి దిగిన డాక్టర్లు సమ్మె ఉపసంహరణకు కొన్ని షరతులు విధించారు. వీటిలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బేషరతుగా డాక్టర్లకు క్షమాపణ చెప్పాలన్నది ఒకటి. 

కోల్ కతాలోని ప్రభుత్వ ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఒక రోగి చనిపోవడంతో బంధువులు ఇద్దరు జూనియర్ డాక్టర్లపై దాడి చేశారు. దీనిపై మెడికల్ అసోసియేషన్ ఆగ్రహించింది. డాక్టర్లు సమ్మె ప్రారంభించారు.