అమ్మకానికి 13 లక్షల క్రెడిట్‌, డెబిట్ కార్డులు..! మీ కార్డు సేఫేనా?

అమ్మకానికి 13 లక్షల క్రెడిట్‌, డెబిట్ కార్డులు..! మీ కార్డు సేఫేనా?

ఎప్పటికప్పుడు హ్యాకర్లు తమ పంతాను మారుస్తూనే ఉన్నారు.. ఇప్పుడు భారత్‌లోని 13 లక్షల మంది డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల వివరాలను హ్యాక్ చేయడమే కాదు.. సంబంధిత ఖాతాదారుల వివరాలను ఏకంగా అమ్మకానికి పెట్టేశారనే వార్త తీవ్ర కలకలం రేపుతోంది.. హ్యాక్ చేయబడిన 13 లక్షల డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఏకంగా రూ.920 కోట్లకు అమ్మేశారట.. ఇది భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద హ్యాక్‌గా చెబుతున్నారు. దీంట్లో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. హ్యాక్ చేసిన కార్డుల్లో 18 శాతం ఒకే బ్యాంకుకు చెందిన కార్డులు కావడం.. ఈ విషయాన్ని సింగపూర్‌కు చెందిన గ్రూప్-ఐబి భద్రతా పరిశోధన బృందం వెల్లడించింది.

‘ఇండియా-మిక్స్-న్యూ -01’ అని పిలువబడే కోడ్, ఈ భారీ హ్యాక్ డేటా రెండు ట్రాక్‌ల క్రింద లభిస్తుందని పేర్కొంది సదరు సంస్థ.. ట్రాక్ 1 మరియు ట్రాక్ 2.. హ్యాక్ చేసిన డేటాలో 98 శాతం భారతీయులకు చెందినదే.. అయితే బ్యాంకుల పేర్లను మాత్రం పేర్కొనలేదు. ప్రతీ కార్డును రూ.7100కు అమ్ముడైనట్టు వెల్లడించింది. ఇక ఇందులో రూపే, మాస్టర్ కార్డు, వీసా కార్డులే ఉన్నట్టు పేర్కొంది. కొన్ని అంచనాల ప్రకారం, భారతీయుల ఆర్థిక వివరాల కోసం ఇప్పటివరకు నివేదించబడిన అతి పెద్ద హ్యాక్ ఇదే.. విక్రయించబడుతున్న డేటాలో కార్డ్ నంబర్, సీవీవీ నంబర్, గడువు తేదీలు, ఖాతాదారుల పేర్లుతో కూడిన వివరాలు ఉన్నట్టు తెలిపింది. 

ఈ కార్డులను డేటాను ఎలా హ్యాక్ చేశారనే దానిపై కూడా సింగపూర్ సంస్థ చెప్పుకొచ్చింది.. ఏటీఎంలలో హ్యాకర్లు అయస్కాంత గీతను ఉంచుతారు, ఇది మొత్తం సమాచారాన్ని దొంగిలిస్తుంది.. ఒకసారి మోసపూరిత వినియోగదారు వారి కార్డును స్వైప్ చేస్తారు. పోస్ యంత్రాల నుండి కార్డు వివరాలను దొంగిలించడానికి కూడా ఇదే పద్ధతి ఉపయోగించినట్టు తెలిపింది. అయితే, అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఏదైనా అనధికార లావాదేవీకి ఉపయోగించబడిందా? లేదా? అనే విషయాన్ని గమనించండి. మీరు అలాంటి లావాదేవీలను గుర్తితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించాలని వెల్లడించింది.