యాదాద్రి జిల్లాలో పద్నాలుగేళ్ల బాలిక హత్య

యాదాద్రి జిల్లాలో పద్నాలుగేళ్ల బాలిక హత్య

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల శ్రావణి అనే బాలికను దారుణంగా హత్య చేసి, వ్యవసాయబావిలో శవాన్ని పడేశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శ్రావణి నిన్న స్కూల్లో స్పెషల్‌ క్లాస్‌ ఉందంటూ బయటకు వెళ్లింది. ఇంటి నుంచి వెళ్లిన శ్రావణి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువుల ఇళ్లల్లో వెతికినా లాభం లేకపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు.

బావి దగ్గర లభించిన శ్రావణి బ్యాగు ఆధారంగా బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సకాలంలో బాలిక మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.