రెబల్ ఎమ్మెల్యేలంతా కమలం గూటికే.. పోటీచేసేది వారే..!

రెబల్ ఎమ్మెల్యేలంతా కమలం గూటికే.. పోటీచేసేది వారే..!

కర్ణాటక రాజకీయాలను దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేసింది.. కాంగ్రెస్-జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిందీ రెబల్ ఎమ్మెల్యేలే. కాంగ్రెస్-జేడీఎస్ కూటిమికి చెందిన రెబల్స్‌ ఎమ్మెల్యేలపై అప్పటి అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. మొత్తం 17 మంది అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో ఇవాళ 15 మంది కమలం పార్టీ గూటికి చేరారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఇవాళ 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు యెడియూరప్ప. కాగా, ఆయా స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలే బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ కూలిపోవడానికి 17 మంది ఎమ్మెల్యేలు కారణం కాగా.. మరో రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానాలకు ప్రస్తుతానికి ఉప ఎన్నికలు నిర్వహించడం లేదు ఎన్నికల కమిషన్. కర్ణాటకలో డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.