ఏపీలో వివాదంగా మారిన మరో విగ్రహం !

ఏపీలో వివాదంగా మారిన మరో విగ్రహం !

 

ఏపీలో మరో విగ్రహం ఇప్పుడు వివాదంగా మారింది. శ్రీ కాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో వివాదంగా మారిన నందివిగ్రహం ఏర్పాటుకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 14వ తేదీన పాలేశ్వరస్వామి ఆలయం కూడలిలో కొందరు వ్యక్తులు 110 సంవత్సరాల నాటి నందీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. పాలేశ్వరస్వామి ఆలయంలో పురాతన చరిత్ర కలిగిన 110 ఏళ్ల నందీశ్వరుడి విగ్రహం మరమ్మత్తులకు గురికావడంతో పదేళ్ల క్రితం తొలగించారు. ఆ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . ఈక్రమంలో మరమ్మత్తులకు గురైన 110 ఏళ్ల విగ్రహాన్ని ఆలయానికి ఎదురుగా ఉన్న రావిచెట్టు కింద ఉంచారు. ఐతే రావిచెట్టు కింద ఉండాల్సిన నందీశ్వరుడి విగ్రహం మూడురోడ్ల కూడలిలోని దిమ్మ పై ప్రత్యక్షం కావడం వివాదంగా మారింది. దీంతో ఈ విగ్రహం ఏర్పాటు పై సంతబొమ్మాళి వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు . సీసీ కెమెరాలో రావిచెట్టు కింద ఉన్న విగ్రహాన్ని తొలగించడం రోడ్డు మధ్యలోని దిమ్మ పై ఏర్పాటు చేయడం స్పష్టంగా రికార్డయ్యింది. ఈ ఫుటేజ్ ఆధారంగా దీనిని పాలేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు , మరికొందరు కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆలయ ఆచారాలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా దురుద్ధేశపూరితంగా కుట్రకోణంలో విగ్రహం ఏర్పాటు చేసినట్లు నిర్ధారణకు రావడంతో 16 మంది పై కేసు నమోదు చేశారు. ఐతే పట్టపగలే అందరూ చూస్తుండగానే రావిచెట్టుకింద ఉన్న నందీశ్వరుడిని తొలిగించి తీసుకెళ్లడం కచ్చితంగా ఉద్ధేశపూర్వకంగా చేసిందేనని ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.