ఒక రోజులో 1700 శాతం లాభం

ఒక రోజులో 1700 శాతం లాభం

జెట్‌ ఎయిర్‌వేస్‌ మూత పడటం స్టాక్‌ మార్కెట్‌ను కుదిపేసింది. కంపెనీ పరిస్థితి పరవాలేదని, బిడ్డింగ్‌ ఎవరో ఒకరు కంపెనీని టేకోవర్‌ చేస్తారనే ఆశాభావంతో గతవారం రూ. 270 వరకు పలికిన షేర్‌ మొన్న భారీగా ఒత్తిడికి గురైంది. మంగళవారం కంపెనీని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, దినసరి ఖర్చులకు కూడా నిధులు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో షేర్‌ రూ. 240 వద్ద ముగిసింది. మార్కెట్‌ ఊహించినట్లే నిన్న రాత్రి కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఇవాళ ఓపెనింగ్‌లోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ ధర 10 శాతం పడింది. ఈ ధర వద్ద కూడా కొనుగోలుదారులు లేకపోవడంతో నిబంధనల మేరకు ట్రేడింగ్‌ను కొద్దిసేపటి వరకు ఆపేశారు. ఆ తరవాత ట్రేడింగ్‌ ప్రారంభమైన కొన్ని సెకన్లకే అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఒకదశలో రూ. 158కి కంపెనీ షేర్‌ పడిపోయింది. కేవలం కొన్ని ట్రేడింగ్‌ సెషన్స్‌లోనే షేర్‌ రూ. 270 నుంచి రూ. 158కి పడిపోయింది. ప్రస్తుతం కోలుకుని 27 శాతం నష్టంతో రూ. 176 వద్ద జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ ట్రేడవుతోంది. కంపెనీని నమ్ముకున్న దీర్ఘాకాలిక ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా... ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్‌ పతనం అవుతుందని ఏప్రిల్‌ నెల కాంట్రాక్టులు కొన్నివారికి కాసుల పంట పండింది. ఈ షేర్‌  ఏప్రిల్‌ పుట్‌ కాంట్రాక్ట్‌ (రూ. 180)  కేవలం ఒకే ఒక ట్రేడింగ్‌ సెషన్‌లో రూ. 2.05 నుంచి రూ. 36కు పెరిగింది. అంటే 1700 శాతం పెరిగిందన్నమాట. షేర్‌ కోలుకున్నా.. ఇంకా 1000 శాతంతో పుట్స్‌ ట్రేడవుతున్నాయి. జెట్‌ షేర్‌ దెబ్బకు... ఈ కంపెనీకి రుణాలు ఇచ్చిన ఎస్‌బీఐ కౌంటర్‌లో కూడా భారీగా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. షేర్‌ ధర రూ. 315.75 నుంచి రూ. 308కి పడిపోయింది.