1984 సిక్కు అల్లర్ల కేసు: మార్చి 25 వరకు సజ్జన్ కుమార్ బెయిల్ విచారణ వాయిదా

1984 సిక్కు అల్లర్ల కేసు: మార్చి 25 వరకు సజ్జన్ కుమార్ బెయిల్ విచారణ వాయిదా

1984 సిక్కు అల్లర్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ఈ ఏడాది హోలీని జైల్లోనే జరుపుకోవాలి. సజ్జన్ కుమార్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్ట్ శుక్రవారం విచారించింది. ప్రస్తుతానికి సజ్జన్ కుమార్ కు కోర్టు ఎలాంటి ఊరట నివ్వలేదు. ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు మార్చి 25 వరకు నిలిపేసింది. సజ్జన్ కుమార్ మండోలి జైలులో ఖైదీగా ఉన్నారు.

సిక్కు అల్లర్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ పిటిషన్ కొట్టేయాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. సజ్జన్ కుమార్ అప్పీల్ తో బెయిల్ అర్జీని కూడా రద్దు చేయాలని సీబీఐ కోర్టుకి  విజ్ఞప్తి చేసింది. సజ్జన్ కుమార్ ను బెయిల్ పై విడుదల చేస్తే ఇతర పెండింగ్ లోని కేసులపై ప్రభావం పడుతుందని వాదించింది. ఆయా కేసుల్లో స్వతంత్రంగా జరుగుతున్న విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. పెద్ద నేత అయిన కారణంగా ఆయన సాక్షులను ప్రభావితం చేయొచ్చని చెప్పింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దర్యాప్తు దిశను ఆయన ప్రభావితం చేశారని సీబీఐ గుర్తు చేసింది. దీంతో సుప్రీంకోర్ట్ మార్చ్ 25కి తదుపరి విచారణను వాయిదా వేసింది. 

ఇవాళ సజ్జన్ కుమార్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్ ల బెంచ్ విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ పిటిషన్ విచారణ నుంచి వైదొలిగారు. ఇంతకు ముందు కోర్టు సజ్జన్ కుమార్ బెయిల్ పిటిషన్ పై 6 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. 

సజ్జన్ కుమార్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ఢిల్లీలోని కెంట్ ప్రాంతంలో సిక్కులను హత్య చేసిన కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్ట్ జీవిత ఖైదు వేసిన తీర్పుని ఆయన సవాల్ చేశారు.