పశ్చిమ బెంగాల్ లో మరోసారి హింస, ఇద్దరి మృతి

పశ్చిమ బెంగాల్ లో మరోసారి హింస, ఇద్దరి మృతి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకి కొద్ది దూరంలో ఉన్న భాట్ పురాలో గురువారం మరోసారి హింస భగ్గుమంది. ఒక మైనర్ బాలుడిని కాల్చి చంపారు. ఆ బాలుడి వయసు కేవలం 17 ఏళ్లు. ఈ కేసులో మొత్తం ఇద్దరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. అజ్ఞాత వ్యక్తుల మధ్య గురువారం ఉదయం వివాదం ప్రారంభమైంది. మైనర్ బాలుడి పేరు రాంబాబు షా. అతను పానీపురీ అమ్ముతుంటాడు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. 

ఈ వివాదంలో నాటుబాంబులు, తుపాకులు ఉపయోగించినట్టు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువుని ప్రయోగించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని సమాచారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక బృందాన్ని సంఘటన స్థలంలో మోహరించారు. ఈ వివాదం కారణంగా వ్యాపారాలు చతికిలబడ్డాయి. దుకాణాలు మూతపడ్డాయి. 

ఈ ఘటన ఉత్తర 24 పరగణ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు జరిగింది. పోలీసు అధికారులు మార్గమధ్యంలో ఉండగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ తర్వాత డీజీపీ కాన్వాయ్ వెనుదిరిగి కోల్ కతాకు వెళ్లిపోయింది. లోక్ సభ ఎన్నికలపుడు పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలు జరిగాయి.