బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరు అరెస్టు

బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరు అరెస్టు

కచ్చులూరు ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా కొంతమంది ప్రయాణికుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. దీంతో వారికోసం గాలింపుచర్యలు కొనసాగుతుండగా బోటు వెలికితీతపనులు అయితే దాదాపు నిలిచిపోయాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు పోలీసులు. పోర్టు అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగా చేసుకుని బోటు ప్రయాణాలను ప్రారంభించటంలో కీలకపాత్ర పోషించిన గేడా వీర వెంకట రమణ సత్య నాగ మురళి అనే జలశ్రీ మురళి, సర్ ఆర్ధర్ కాటన్ ఏసీ బోటు యజమానుల సంఘ అధ్యక్షుడు యర్రంశెట్టి రాజారావు అరెస్టయిన వారిలో ఉన్నారు.

పాపికొండలు బోటు ఓనర్స్ అండ్ ఏజెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ వ్యవహారాలను చూసే ఈ ఇద్దర్నీ సోమవారం అదుపులోనికి తీసుకుని రంపచోడవరం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ముడు రోజుల క్రితం ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని మృత దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 77 మంది ప్రయాణించగా 26 మంది ప్రాణాలతో బయట పడ్డారు.

36 మంది మృతదేహాలు లభ్యం కాగా మిగతా మృతదేహల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు  10 లక్షల చొప్పున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అందిస్తున్నట్టు అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారంతో దీనికి సంబంధం లేదని చెబుతున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. మృతుల బంధువులు నేరుగా ఇక్కడకు వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించి బీమా డబ్బు పొందవచ్చని తెలిపారు.