'మురారి'గా మురిపించిన మహేశ్ బాబు

'మురారి'గా మురిపించిన మహేశ్ బాబు

నేడు సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న మహేశ్ బాబు కెరీర్ లో తొలి డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలచింది 'మురారి'. 2001 ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదలయింది. ఈ యేడాది ఫిబ్రవరి 17తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. 

'మురారి'కి ముందు... 
'మురారి'కి ముందు మహేశ్ బాబు నవయువ కథానాయకునిగా అలరించిన చిత్రాలు మూడంటే మూడు... అందులో ఆరంభంలోనే వచ్చిన 'రాజకుమారుడు' అభిమానులకు పరమానందం పంచింది... ఆ తరువాత మహేశ్ హీరోగా వచ్చిన 'యువరాజు' హిట్ అనిపించుకుంది... ఈ రెండు చిత్రాల తరువాత కృష్ణ, మహేశ్ బాబు కలసి నటించిన 'వంశీ'పై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా వారికి నిరాశ కలిగించింది. ఆ తరువాత నుంచీ అందరి చూపు కృష్ణవంశీ డైరెక్షన్ లో మహేశ్ నటిస్తోన్న 'మురారి'పైనే నిలచింది... ఆ సినిమాతో మహేశ్ బంపర్ హిట్ ను సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశించారు... వారి ఆశ నిరాశ కాలేదు... 'మురారి' ఫ్యాన్స్ ను మురిపించింది... 

అతడే కారణం...
'మురారి'పై ఘట్టమనేని అభిమానులకు అంచనాలు పెరగడానికి కారణం ఈ చిత్ర నిర్మాణ సారథి నందిగం రామలింగేశ్వరరావు... ఆయన నటశేఖర కృష్ణకు వీరాభిమాని... ఆయన కృష్ణతో "కిరాయి కోటిగాడు, కంచుకాగడా" వంటి చిత్రాలు నిర్మించి అభిమానులను అలరించారు... అందువల్ల నందిగం రామలింగేశ్వరరావు అంటే కృష్ణ అభిమానులకు ఎంతో అభిమానం. రామలింగేశ్వరరావు నిర్మాణ సారథిగా గోపీ నందిగం ఈ చిత్రాన్ని నిర్మించారు. దాంతో ఆరంభం నుంచీ 'మురారి'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా టైటిల్ కార్డ్స్ లో ముందుగానే 'ఘట్టమనేని వంశాభిమానులకు' అంటూ కార్డ్ వేశారు రామలింగేశ్వరరావు. దాంతో ఫ్యాన్స్  మరింత మురిసిపోయి, 'మురారి'ని ఆదరించారు.

అయినా... 
బాలనటునిగానే భళా అనిపించాడు మహేశ్ బాబు. అప్పటి నుంచే మహేశ్ బాబును తమ యంగ్  హీరో అంటూ రామలింగేశ్వరరావు గొప్పగా చెప్పుకొనేవారు. అందువల్లే 'మురారి'ని భారీగా నిర్మించారు. అయితే నిర్మాణం సాగుతూఉండగా రామలింగేశ్వరరావుకు, దర్శకుడు కృష్ణవంశీకి మధ్య  అభిప్రాయభేదాలు తలెత్తాయి. అయినా రామలింగేశ్వరరావు ఖర్చుకు వెనుకాడకుండానే చిత్రాన్ని పూర్తి చేశారు. అదే తీరున కృష్ణవంశీ సైతం ఈ సినిమాను జనరంజకంగా తెరకెక్కించారు.

కథలో వైవిధ్యం...
తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలనే తపించేవారు కృస్ణవంశీ.. ఆ తీరున ప్రయోగాలూ చేశారు... కొన్ని సార్లు విజయం సాధించారు... అదే తీరున 'మురారి'లోనూ కథలోనే నవ్యతను జోడించారు... ఓ జమీందార్  బ్రిటిష్ వారి కోసం తమ ఇలవేల్పు అయిన అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలిస్తాడు... అమ్మవారి ఆగ్రహానికి గురై చస్తాడు... అప్పటి నుంచీ ప్రతి 48 ఏళ్ళకు ఒకసారి ఆ జమీందార్ ఇంటిలోని వారసుల్లో ఒకరు మరణిస్తూ ఉంటారు... ఆ తీరున హీరో కూడా మరణిస్తాడని భావిస్తారు... అమ్మవారి అనుగ్రహంతోనూ,  ఆ ఇంటి పెద్ద అయిన ముసలావిడ త్యాగంతోనూ హీరో ప్రాణాలు నిలుస్తాయి. ఇదీ కథ... దీనిని కృష్ణవంశీ తనదైన శైలిలో తెరకెక్కించి రక్తి కట్టించారు... 

కృష్ణవంశీ మార్కు!
కృష్ణవంశీ సినిమా అనగానే అందులోని పాటల చిత్రీకరణలో ఎంతో వైవిధ్యం ఉంటుందని అందరికీ తెలుసు... 'మురారి'లోనూ కృష్ణవంశీ పాటలను తెరకెక్కించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది...  కృష్ణవంశీ చిత్రాలను పరిశీలిస్తే ఆయనపై బాలీవుడ్ ప్రభావం భలేగా ఉందనిపిస్తుంది. తొలి చిత్రం 'గులాబి' మొదలు ఆయన తెరకెక్కించిన పలు సినిమాల్లో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది... 'నిన్నే పెళ్ళాడతా'లో హిందీ సినిమా 'హమ్ ఆప్కే హై కౌన్' స్ఫూర్తి కనిపిస్తుంది... అదే తీరున 'మురారి'లోనూ సినిమాలో అత్యధిక భాగం సన్నివేశాల్లో భారీతారాగణం కనిపించి కనువిందు చేశారు. మోడరన్ థాట్స్ తో సినిమాలు రూపొందించినా, వాటిలో మన సంప్రదాయాలనూ చొప్పించడం కృష్ణవంశీ బాణీ... 'మురారి'లోనూ కథలో ఛాందసభావాలు కనిపిస్తాయి... అయితే కథనంలో వైవిధ్యం చోటు చేసుకుంటుంది... ఇక హీరో, హీరోయిన్ మోడరన్ గా కనిపిస్తూ, పల్లె అందాల నడుమ సైతం నయనానందం కలిగిస్తారు. 

అలరించిన తీరు...
'మురారి' సినిమాలో నాటి మేటి సీనియర్ నటీనటులు, అప్పటి వర్ధమాన నటీనటులు కలసి నటించారు... సినిమాలో పలు సన్నివేశాలు వీరితో నిండుగా కనిపిస్తాయి... ఇందులోని కథ, కథనం మహిళా ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి... దాంతో 'మురారి' తరువాత మహేశ్ సినిమాలకు లేడీస్ ఆడియెన్స్  రావడం గణనీయంగా పెరిగింది. అందాల భామ సోనాలీ బింద్రేకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం... 
'మురారి' చిత్రానికి మణిశర్మ సమకూర్చిన సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలచింది... ఇక వేటూరి , సీతారామశాస్త్రి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ రాసిన పాటలు వీనులవిందు చేశాయి... మొత్తం ఏడు పాటలున్నాయి... నాలుగు పాటలను సీతారామశాస్త్రి రాయగా, మిగిలిన మూడు పాటలను ఒక్కొక్కరు ఒక్కో పాట రాశారు... అప్పట్లో ఆడియో సేల్స్ లో మహేశ్ బాబు సినిమాల్లో 'మురారి' రికార్డు సృష్టించింది... 

'మురారి'తో మొదలు...
'మురారి' చిత్రం ఆరంభంలో డిఫరెంట్ టాక్ సంపాదించింది... ఈ సినిమా నిడివి బాగా ఎక్కువయిందని పలు కేంద్రాలలో సినిమా ఆపరేటర్స్  కత్తెరవేసి సీన్స్ కట్ చేసి ప్రదర్శించారు... ఈ సినిమా వచ్చే నాటికే బాలకృష్ణ 'నరసింహనాయుడు' విడుదలై విజయవిహారం చేస్తోంది... ఆ చిత్రం విడుదలైన 36 రోజులకు 'మురారి' జనం ముందు నిలచింది... అంతటి సూపర్ హిట్ మూవీ ఉన్నా, 'మురారి'ని సైతం ప్రేక్షకులు ఆదరించారు... అలా 23 కేంద్రాలలో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది... ఈ చిత్రానికంటే ముందు మహేశ్ 'రాజకుమారుడు' ఇంతకంటే ఎక్కువ సెంటర్లలోనే శతదినోత్సవం జరుపుకుంది... అయితే మహేశ్ బాబు కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలచింది 'మురారి'..  ఈ తరం హీరోల్లో నాలుగు డైరెక్ట్ సిల్వర్ జూబ్లీస్ అందునా ఒకే థియేటర్ లో ఆ నాలుగూ ఆడడం అన్న రికార్డును సొంతం చేసుకున్నది మహేశ్ బాబు ఒక్కరే! ఆ రికార్డుకు నాంది పలికింది 'మురారి'... హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్. థియేటర్ లో మహేశ్ కు తొలి జూబ్లీ ఇది. దీని తరువాత "ఒక్కడు, అతడు, పోకిరి" చిత్రాలు కూడా అదే థియేటర్ లో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం... 

అసలు విశేషం!
మరింత విశేషమేమంటే- కృష్ణవంశీ కెరీర్ లో డైరెక్టు సిల్వర్ జూబ్లీస్ రెండే రెండు- అవి 'నిన్నే పెళ్ళాడతా', 'మురారి' . ఈ రెండు చిత్రాల టైటిల్స్  కార్డ్స్ పడే సమయంలో మహానటుడు యన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాటలు వినిపించడం విశేషం. 'నిన్నే పెళ్ళాడతా'లో 'సీతారామకళ్యాణం'లోని "సీతారాముల కళ్యాణం చూతము రారండి.."  సాంగ్ నేపథ్యంలో టైటిల్స్ వేశారు. 'మురారి'లో 'పాండురంగ మహాత్మ్యం'లోని "జయకృష్ణా ముకుందా మురారి..." సాంగ్ వేస్తూ టైటిల్స్  కనిపించేలా చేశారు... ఇలా కృష్ణవంశీకి యన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్స్  కలసి వచ్చాయని చెప్పాలి...  మహేశ్ బాబు కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలచిన 'మురారి' సందడి చేసిన  తీరు చూశారుగా... ఈ సినిమా విశేషాలు తలచుకొని అభిమానులు సైతం ఆనందసాగరంలో మునకలు వేస్తుంటారని ఆశిద్దాం.