‌ఇరవై ఏళ్ళ 'నరసింహనాయుడు'

‌ఇరవై ఏళ్ళ 'నరసింహనాయుడు'

తెలుగు ధరిత్రిని పులకింప చేసిన చరిత్ర లిఖించిన చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో... అలాంటి చిత్రాలకు సంక్రాంతి సంబరాలే వేదికగా నిలచిన సందర్భాలూ ఉన్నాయి... 2001 సంవత్సరం సంక్రాంతికి మేటిగా సందడి చేసిన చిత్రం 'నరసింహనాయుడు'... జనవరి 11తో ఈ చిత్రం ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది... ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం... 

అభిమానులకు మరపురాని చిత్రం

'నరసింహనాయుడు' - ఈ సినిమా టైటిల్ వింటే చాలు ఈ నాటికీ బాలకృష్ణ అభిమానుల ఆనందం  అంబరమంటుతూ ఉంటుంది... 'నరసింహనాయుడు' చిత్రం ఆరంభం నుంచీ అభిమానుల మదిలో ఆనందం నింపుతూనే ఉంది... అందుకు కారణం బాలకృష్ణతో అప్పటికే మూడు వరుస విజయాలు చూసిన దర్శకుడు బి.గోపాల్ ... అంతకు ముందు బాలయ్యతో గోపాల్ తెరకెక్కించిన 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్ స్పెక్టర్', 'సమరసింహారెడ్డి' చిత్రాలు ఒకదానిని మించి మరోటి విజయం సాధించాయి... బాలయ్య, గోపాల్ కాంబోలో వచ్చిన నాల్గవ చిత్రం 'నరసింహనాయుడు'... అందువల్ల మొదటి నుంచీ అభిమానుల్లో ఉత్సాహం కలిగిస్తూనే ఉంది ఈ చిత్రం... 'నరసింహనాయుడు' సినిమా ఎప్పుడు వచ్చినా సక్సెస్ గ్యారంటీ... ఇక సంక్రాంతి సంబరాలకే వస్తే మరింత విజయం సాధిస్తుందని బాలయ్య  అభిమానులు భావించేవారు...ఎందుకంటే ఈ సినిమా విడుదలకు రెండేళ్ళు ముందు అంటే 1999లో బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన 'సమరసింహారెడ్డి' సంక్రాంతి కానుకగానే వచ్చి సంబరాలు చేసింది... ఆ సినిమా తరిగిపోని, చెరిగిపోని పలు రికార్డులు నమోదు చేసి, గోల్డెన్ జూబ్లీ హిట్ గా నిలచింది... సంక్రాంతి సంబరాల్లో అంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో 'సమరసింహారెడ్డి' విజయం సాధించింది... ఈ చిత్రం ఏకంగా 30కి పైగా కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది... ఇక స్వర్ణోత్సవం కూడా చేసుకుంది... అలాంటి చరిత్ర ఈ నాటికీ ఏ టాప్ హీరోకు దక్కలేదు... అందువల్ల బాలయ్య , గోపాల్ కాంబోలో వస్తున్న మరో సంక్రాంతి చిత్రం అనగానే 'నరసింహనాయుడు'పై అంచనాలు పెరిగాయి... టాప్ స్టార్స్  చిత్రాలకు హిట్ టాక్ వస్తే, బాక్సాఫీస్ వద్ద సదరు చిత్రాల తీరే వేరుగా ఉంటుంది... ఇక సంక్రాంతి సందడిలో హిట్ టాక్ సంపాదించిన సినిమాల తీరు మరింత వేరుగా ఉండడం ఖాయం... అందుకనే పొంగల్ కు హంగామా చేసే సినిమాలపైనే అభిమానుల ఆశలు కూడా హెచ్చుగా ఉంటాయి... అందుకు తగ్గట్టుగానే 'నరసింహనాయుడు' తొలి ఆట నుంచీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకు పోయింది... 

మరచిపోలేని పోటీ!

తెలుగు చిత్రసీమలో యన్టీఆర్, ఏయన్నార్ తరువాత అంతలా పలుమార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అనే చెప్పాలి... బాలకృష్ణ సోలో హీరోగా చిత్రసీమలో అడుగు పెట్టిన 1984 నుండి బాలయ్య, చిరంజీవి మధ్య  ఈ పోటీ అనేక పర్యాయాలు సాగింది... పలుమార్లు సంక్రాంతి బరిలోనూ ఢీ అంటే ఢీ అని సాగారు... అయితే  వారిద్దరి సినిమాలు ఒకే రోజున పోటీ పడింది లేదు... ఒకే ఒక్క 2001వ సంవత్సరం జనవరి 11న మాత్రమే బాలయ్య, చిరంజీవి సినిమాలు  ఒకేరోజున బాక్సాఫీస్ బరిలో నిలిచాయి... బాలయ్య 'నరసింహనాయుడు'గా జనం ముందుకు వస్తే, చిరంజీవి 'మృగరాజు'తో పోటీకి దిగాడు... నిజానికి అంతకు ముందు సంవత్సరం అంటే 2000లో సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'అన్నయ్య' మంచి విజయం సాధించింది... ఆ సమయాన వచ్చిన బాలయ్య 'వంశోద్ధారకుడు' అంతగా అలరించలేకపోయింది... కానీ, అంతకు ముందు సంవత్సరం అనగా 1999లో చిరంజీవి 'స్నేహం కోసం' కంటే బాలయ్య 'సమరసింహారెడ్డి' మిన్నగా సాగాడు... ఈ కారణంగా ఒకే రోజున వస్తున్న ఆ ఇద్దరు మాస్ హీరోల సినిమాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది... ఆ సంక్రాంతి సంబరాల్లో 'నరసింహనాయుడే' విజేతగా నిలిచాడు... నిజానికి అంతకు ముందు యేడాది సంక్రాంతి సంబరాల్లో విజయం సాధించిన ఊపులో చిరంజీవి నటించిన 'మృగరాజు' చిత్రం బాలకృష్ణ 'నరసింహనాయుడు' కంటే ఎక్కువ థియేటర్లలో  విడుదలయింది... బాలకృష్ణ, గోపాల్ కాంబోపై ఉన్న నమ్మకంలో 'నరసింహనాయుడు' కూడా తక్కువేమీ కాకుండా 100కు పైగా  ప్రింట్లతో వచ్చింది... కానీ, 15వ తేదీన వచ్చిన 'దేవీపుత్రుడు' కారణంగా బాలకృష్ణ 'నరసింహనాయుడు' సైడ్ థియేటర్లనే పలు కేంద్రాలలో తీసి వేశారు... అయినా, మొదటి వారంలోనే 'నరసింహనాయుడు' భళా అనిపించాడు... 
 
తొలిసారి వంద కేంద్రాలలో...
 
ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో రికార్డుల మోత మోగించింది... ఆల్ టైమ్ రికార్డ్స్  సృష్టించింది...'మృగరాజు' కంటే 'నరసింహనాయుడు' తక్కు వ ప్రింట్లతో విడుదలైనా, సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని జయకేతనం ఎగురవేసింది... 105 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది... తెలుగు చిత్రసీమలోనే కాదు దక్షిణ భారతంలోనే తొలిసారి వంద కేంద్రాలలో నూరురోజులు ఆడిన  సినిమాగా చరిత్రలో నిలచిపోయింది 'నరసింహనాయుడు'...ఆ తరువాత ఎందరు ఎన్ని కేంద్రాలలో శతదినోత్సవాలు చేసుకున్నా, ఫస్ట్ సెంచరీ కొట్టినోడిదే ఘనత అన్నట్టు, 'నరసింహనాయుడు' అభిమానులను ఎంతగానో మురిపించింది..

రికార్డుల మోత

'నరసింహనాయుడు' చిత్రం రన్నింగ్ లోనూ రికార్డులు బద్దలు చేసింది... 42 కేంద్రాలలో 125 రోజులు ప్రదర్శితమైన ఈ చిత్రం 19 కేంద్రాలలో నేరుగా రజతోత్సవం జరుపుకుంది... ఇక ఏలూరు లో ఈ చిత్ర ప్రదర్శనే ఈ నాటికీ రికార్డుగా నిలచింది...  ఏలూరు అంబికా కాంప్లెక్స్ లోని రెండు థియేటర్లలో మొదటి వారమే 101 ఆటలు పూర్తిచేసుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు నరసింహనాయుడు... క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక కలెక్టర్ ఎక్ట్స్రా  షోస్ కు పర్మిషన్ ఇచ్చారు... దాంతో కొన్ని రోజులు డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా ప్రదర్శితమై ఈ నాటికీ రికార్డుగా నిలచింది...  అలాగే మినీ అంబికా థియేటర్ లో ఏకధాటిగా 275 రోజులు ప్రదర్శితమై చరిత్ర సృస్టించింది... అదే థియేటర్ లో 1250 ఆటలు ప్రదర్శితమై ఈ నాటికీ కోస్తాంధ్రలో చెక్కుచెదరని రికార్డును నమోదు చేసింది.   తిరుపతిలో 141 రోజులు ఐదు ఆటలతో ప్రదర్శితమయింది... 5 కేంద్రాలలో (వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి) వంద రోజులు హౌస్ ఫుల్స్  అయింది... ఈ నాటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది... కర్నూలు జిల్లాలో ఒకే ప్రింట్ తో కోడుమూరు, గూడురు కేంద్రాలలో 'నరసింహనాయుడు' శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పటి దాకా ఆ రికార్డు చిత్రసీమలోనే మరో హీరోకు కానరాలేదు. సంక్రాంతి సంబరాల్లో ఓ టాప్ హీరో మూవీ ఇన్ని విధాలుగా రికార్డులు బద్దలు చేయడం అన్నది ఇప్పటి దాకా మళ్ళీ  జరగలేదు... ఆ రికార్డు ఈ నాటికీ 'నరసింహనాయుడు'కే సొంతమయింది... 

రివార్డులతో పాటు అవార్డు

బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో వరుసగా విజయం సాధించిన నాల్గవ చిత్రంగా 'నరసింహనాయుడు' నిలచిపోయింది... ఈ సినిమా ఘనవిజయానికి ఇందులో నటించిన వారు, పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ కారణమేనని శతదినోత్సవ వేదికపై హీరో బాలకృష్ణనే సెలవిచ్చారు... విజయవాడలో జనసముద్రం నడుమ 'నరసింహనాయుడు' వందరోజుల సంబరం అంబరమంటేలా సాగింది... ఇంత హంగామా సృష్టించిన 'నరసింహనాయుడు' తెలుగు చిత్రసీమలో తొలిసారి పాతిక కోట్లు షేర్ చూసిన సినిమాగానూ నిలచింది... అంతేనా ఓ స్టార్ హీరో టైటిల్ రోల్ పోషించిన చిత్రం పొంగల్ బరిలో ఇంతలా హంగామా చేసిన సినిమా మళ్ళీ  ఇప్పటి దాకా కనిపించలేదనీ అభిమానులు అంటున్నారు...పైగా ఈ చిత్రం బాలకృష్ణకు ఉత్తమనటుడుగా నంది అవార్డునూ సంపాదించి పెట్టింది...ఇక అభిమానుల ఆనందానికి హద్దులుంటాయా? బాలకృష్ణ ఉత్తమనటునిగా నంది అందుకున్న తొలి చిత్రంగానూ 'నరసింహనాయుడు' నిలచిపోయింది. 

బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'నరసింహనాయుడు'లో సిమ్రాన్, ప్రీతి జింగియాని, ఆశా షైనీ, కె.విశ్వనాథ్, ముకేశ్ ఋషి, జయప్రకాశ్ రెడ్డి, మోహన్ రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, శివాజీరాజా తదితరులు నటించారు... ఈ చిత్రానికి విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రాపర్ కాగా, మణిశర్మ స్వరాలు అందించారు.వేటూరి, భువనచంద్ర, వెన్నెలకంటి, సీతారామశాస్త్రి పాటలు రాశారు... చిన్ని కృష్ణ కథకు, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు పలికించారు.. ఈ సినిమాలోని మాటలు, పాటలు ఈ నాటికీ జనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం... బాలకృష్ణ అభిమానులను 'నరసింహనాయుడు' చిత్రం ఎందుకంత  విశేషంగా ఈ నాటికీ మురిపిస్తోందో తెలిసిందిగా!.. ఇలా ఆ తరువాత కూడా బాలయ్య తన అభిమానులను తనదైన పంథాలో అలరిస్తూనే ఉన్నారు... మరి 2021లో అభిమానులకు బాలయ్య ఏ తీరున ఆనందం పంచుతారో చూద్దాం...