అప్పుడు కర్ణాటకలో..! ఇప్పుడు మహారాష్ట్రలో..!

అప్పుడు కర్ణాటకలో..! ఇప్పుడు మహారాష్ట్రలో..!

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. రాత్రి వరకు ఓ పార్టీ జెండా మోసిన వాళ్లు.. మరునాడు మరో పార్టీ జెండా బుజాన వేసుకోవచ్చు.. కొందరైతే ఏకంగా ప్రత్యర్థులతోనే చేతులు కలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు.. కీలక పదవులు పొందవచ్చు. ఇక, ఇప్పుడు మహారాష్ట్ర రాజీకాయాలో ఆసక్తి నెలకొనేలా చేస్తున్నాయి. 2006లో కర్ణాటకలో జరిగిన తరహా రాజకీయాలు ఇప్పుడు మహారాష్ట్రలో రిపీట్ అయ్యాయా? శరద్ పవార్‌కు తెలీకుండానే అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపారా?అప్పట్లో కర్ణాటక మాజీ ప్రధాని దేవేగౌడకు సమాచారం లేకుండానే ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీతో చేతులు కలిపారా?అసలు... ఇదంతా రాజకీయాల్లో సాధ్యం అయ్యే పనేనా?ఈ ప్రశ్నకు సమాధానం ఆ రెండు పార్టీల నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంతకీ...2006లో కర్ణాటకలో ఏం జరిగింది? 

మహారాష్ట్రలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను 2006 నాటి కర్ణాటక రాజకీయాలతో పోల్చి చూస్తున్నారు విశ్లేషకులు. ఆ సమయంలో కర్ణాటక రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. ధరంసింగ్ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకుంది. రాత్రికి రాత్రి జరిగిన రాజకీయ మలుపులతో జేడీఎస్-బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అన్ని చర్చలు ఫలించాయి. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో 2006 ఫిబ్రవరి 4న హెచ్.డీ. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, బీఎస్. యడియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకలో చెరో 20 నెలలు ప్రభుత్వాన్ని పంచుకోవాలని బీజేపీ-జేడీఎస్ నిర్ణయం తీసుకున్నాయి. ఇటు...మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక చాల పెద్ద కథే ఉంది. గతంలో బీజేపీ నాయకత్వం కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడను రాజకీయంగా దెబ్బ కొట్టింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కూడా కమలదళం అలాగే దెబ్బతీసింది. రెండు చోట్ల బీజేపీ రాజకీయ చాణక్యానికి బలి అయ్యింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. 

మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు హెచ్.డీ. కుమారస్వామిని అప్పుడు వలలో వేసుకుంది బీజేపీ. ఇప్పుడు మహారాష్ట్రలో అజిత్ పవార్ ను బుట్టలో పడేసింది కూడా బీజేపీనే. ప్రస్తుతం శరద్ పవార్ పరిస్థితి ఎలా ఉందో ఆ రోజు మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ పరిస్థితి కూడా అంతే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ నాయకుల రాజకీయ వ్యూహాలకు కాంగ్రెస్ నేతలు గిలగిలలాడిపోతున్నారు. కర్ణాటకలో బీజేపీతో కలిసి జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంతో ఆ రోజు దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడపై మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్ తదితరులు బహిరంగంగా మాజీ ప్రధాని దేవేగౌడ మీద విమర్శలు చేశారు. అయితే తన కుమారుడు హెచ్.డీ. కుమారస్వామి తనతో ఒక్కమాట కూడా చర్చించకుండానే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారని మాజీ ప్రధాని దేవేగౌడ సింపుల్‌గా చేతులు ఎత్తేశారు. కర్ణాటకలో అప్పుడు బీజేపీ-జేడీఎస్ పార్టీలు ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయో ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీలు అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రి రాజకీయాలు మార్చేయడంలో బీజేపీ మాత్రం వంద శాతం విజయం సాధించిందని చెప్పవచ్చు. ఆ రోజు బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఏం చెప్పారో ఈ రోజు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అదే చెబుతున్నారు. ఇద్దరూ తమకు తెలీకుండానే ఇదంతా జరిగిపోయింది అని ఒకే ఒక్క మాట చెప్పారు.