బీజేపీ ఎంపీకి పెద్ద షాకిచ్చిన ఎన్ఐఏ కోర్ట్

బీజేపీ ఎంపీకి పెద్ద షాకిచ్చిన ఎన్ఐఏ కోర్ట్

ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు భోపాల్ లోక్ సభ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కి పెద్ద షాకిచ్చింది. వారంలో ఒక సారి కోర్టుకి హాజరు కావడం నుంచి శాశ్వతంగా మినహాయింపు కోరుతూ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ పెట్టుకున్న అర్జీని కోర్టు తిరస్కరించింది. తను ఎంపీ అయినందువల్ల తను రోజూ పార్లమెంట్ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఆమె తన అప్పీలులో పేర్కొన్నారు. ముంబై ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సాధ్వీ ప్రజ్ఞకు ఇవాళ కోర్టులో హాజరు కావడం నుంచి మినహాయింపు ఇచ్చింది.

సాధ్వీ ప్రజ్ఞ, మరో ఆరుగురు నిందితులు యుఏపీఏ, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరిపై మాలేగావ్ లో ఒక మసీదు దగ్గర బాంబు పేలుళ్లు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

మాలేగావ్ పేలుళ్లు దాదాపు 11 ఏళ్ల క్రితం జరిగాయి. సెప్టెంబర్ 29, 2008న ఉత్తర మహారాష్ట్రలోని మాలేగావ్ మసీదు ఎదుట నిలిచి ఉన్న ఒక మోటార్ సైకిల్ లో అమర్చిన పేలుడు పదార్థాల కారణంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఈ పేలుళ్లలో ఆరుగురు చనిపోయారు. ఇంచుమించు 100 మంది క్షతగాత్రులయ్యారు. పోలీసుల ప్రకారం పేలుడు పదార్థాలు ఉన్న వాహనం ప్రజ్ఞా ఠాకూర్ పేరుతో రిజిస్టరై ఉంది. దీని కారణంగానే సాధ్వీ పేరు పేలుళ్లతో ముడిపడింది. 2017లో ముంబై హైకోర్ట్ ఆమె బెయిల్ అర్జీని మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు చేస్తోంది.