ఫిఫా: క్వార్టర్స్‌లో క్రొయేషియా

ఫిఫా: క్వార్టర్స్‌లో క్రొయేషియా

క్రొయేషియా జట్టు ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆదివారం క్రొయేషియా, డెన్మార్క్‌ జట్ల మధ్య జరిగిన ప్రీక్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్‌ 3-2తో క్రొయేషియా విజయం సాధించింది. తొలి భాగం ప్రారంభంలోనే డెన్మార్క్‌ ఆటగాడు మతియాస్‌ జార్జినసన్‌ గోల్‌ చేయడంతో ఆ జట్టు 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం 4వ నిమిషంలో క్రియేషియా ప్లేయర్ మరియో మాండ్‌జుకిక్‌ గోల్‌ చేయడంతో స్కోరును 1-1తో సమం అయింది. ఆ తర్వాత ఇరు జట్లు రెండు భాగాల్లో పోటాపోటీగా గోల్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదనపు సమయంలో కూడా మరో గోల్‌ లేకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది. ఈ షూటౌట్లో క్రొయేషియా ఆటగాళ్లు ఆండ్రెజ్ క్రమారిక్‌, లుకా మాడ్రిక్‌, ఇవాన్‌ రాకిటిక్‌ గోల్స్‌ సాధించి ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. మరోవైపు ఒత్తిడికి గురైన డెన్మార్క్‌ ఓటమిపాలయింది. తాజా విజయంతో క్రియేషియా జట్టు 1998 తర్వాత ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఆదివారం జరిగిన మరో మ్యాచ్ లో స్పెయిన్‌ జట్టు ఆతిథ్య రష్యా చేతిలో 3-4 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. జర్మనీ, అర్జెంటీనా, పోర్చుగల్‌ జట్లు కూడా ఫిఫా ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ నుంచి నిష్క్రమించాయి.