ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో 24 గంటల న్యూస్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో 24 గంటల న్యూస్

అధునాతన టెక్నాలజీలో కొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్న చైనా.. మరో కొత్త ప్రయోగం చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కృత్రిమ యాంకర్లను తయారు చేసి న్యూస్ రీడర్స్ గా పరిచయం చేసింది. 24 గంటలు, 365 రోజుల పాటు విసుగూ విరామం లేకుండా... వచ్చిన వార్త వచ్చినట్టు.. చదివి పెట్టేవారే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాంకర్లు. చైనాలోని వూజెన్ సిటీలో బుధవారం ఈ సరికొత్త న్యూస్ రీడింగ్ ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. తాజాగా న్యూస్ చదివిన యాంకర్ పేరు కియు హావో. ఇంగ్లిష్ లో న్యూస్ చదివింది. 

చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ అయిన జిన్హువా, చైనీస్ సెర్చ్ ఇంజిన్ సొగొవు కలిసి ఏఐ యాంకర్స్ ను డెవలప్ చేశాయి. వాయిస్ సిమ్యులేషన్, మోడ్యులేషన్ ను మెషీన్ లర్నింగ్ ద్వారా నేర్పించారు. ఫేషియల్ మూవ్ మెంట్స్ తో రియల్ లైఫ్ బ్రాడ్ కాస్టర్స్ లాగా  మెప్పించడం విశేషం. మెడలు, భుజాలు అవసరానికి తగినట్టు స్వల్పంగా కదిలించడం ద్వారా అచ్చంగా జీవమున్న న్యూస్ రీడర్స్ గానే కనిపిస్తున్నారు. రోబో లాగా బిగుసుకుపోయి ఉండకుండా కనుబొమ్మలు కదిలిస్తూ.. ప్రొఫెషనల్స్ లుక్ ఇస్తున్నాయి... ఈ ప్రాణమున్న రోబో లాంటి యాంకర్లు. 

చైనా ప్రతియేటా నిర్వహించే వాల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ లో తాజాగా ఏఐ యాంకర్స్ ను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇందులో కొత్తేముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలీజెన్స్ తో చైనా టెక్ పోలీసింగ్ నిర్వహిస్తే చాలా ప్రమాదకరమని కొందరు అంటుండగా.. మామూలు వాయిస్ రికార్డర్ కే అలాంటి ఇమేజ్ ను అటాచ్ చేశారని, ఇందులో ఇన్నొవేషన్ ఏముందని పెదవి విరుస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రాణమున్న మనిషి పోటీ పడలేడని, అందువల్ల అది ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.