కల్తీ మద్యం తాగి 25 మంది బలి 

కల్తీ మద్యం తాగి 25 మంది బలి 

ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కల్తీ మద్యం తాగి  25 మందికి పైగా మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్‌, షాహారాన్‌పూర్‌ల్లో కల్తీ మద్యం కారణంగా 16 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రూ.2 లక్షల చొప్పుల పరిహారం ప్రకటించారు.  చికిత్స పొందుతున్న వారికి సీఎం రూ.50వేలు పరిహారం ప్రకటించారు. బాధితులకు కావాల్సిన సాయం అందించాలని ఆదేశించారు.  యూపీలో మృతి చెందిన 16 మందిలో ఎనిమిది మంది ఖుషీనగర్‌కు చెందిన వారు కాగా మరో ఎనిమిది మంది షాహారాన్‌పూర్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ ఘటనతో ఎక్సైజ్‌ శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్‌‌తో పాటు‌ మరో ముగ్గురిని సస్పెండ్‌ చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు.  ఉత్తరాఖండ్‌లోనూ ఇటువంటి ఘటనే జరిగింది. రూఢ్‌కీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కల్తీ మద్యం తాగి సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్ర అస్వస్థతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి చెప్పిన వివరాల మేరకు 13 మంది ఎక్సైజ్‌ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.