సమ్మెను ఉపసంహరించుకున్న ఆర్టీసీ సంఘాలు

సమ్మెను ఉపసంహరించుకున్న ఆర్టీసీ సంఘాలు

ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చలు సఫలమయ్యాయి. 25 శాతం ఫిట్‌మెంట్‌కు ఆర్టీసీ కార్మికసంఘాలు అంగీకరించాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు.. జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. చర్చల్లో సానుకూల నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.  పెరిగిన ఫిట్ మెంట్ కారణంగా రూ.750 కోట్లు భారం పడుతుందని అన్నారు. ఎన్జీవోలతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇస్తామని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సంస్థను నష్టాల్లోకి పడేస్తుందని అన్నారు. ఆక్యూపెషన్ 80 శాతం పెంచినా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి  వివరించారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం, ఇతర కార్మిక సంఘాల నాయకులు జేఏసీగా ఏర్పడి ఈ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి జేఏసీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా 12 రీజియన్లలో సమ్మెకు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని 12 రీజియన్లలో అన్ని డిపోల ఎదుట నిరసనలు, ఆందోళనలు చేశారు.