ట్రెండ్ సెట్ చేసిన 'శివ'కు 29 ఏళ్ళు !

ట్రెండ్ సెట్ చేసిన 'శివ'కు 29 ఏళ్ళు !

తెలుగు పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆర్జీవి, నాగార్జునల 'శివ'.  తెలుగు సినిమా గమనాన్ని కొత్త మలుపు తిప్పిన ఈ సినిమా విడుదలై ఈరోజుకి సరిగ్గా 29 ఏళ్ళు.  తెలుగు సినిమా అంటే శివకు ముందు శివ తర్వాత అనే చెప్పుకునేలా ప్రసిద్ధికెక్కిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని తీసిన తనకు కూడ తెలియదంటాడు వర్మ. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గర్నుండి షాట్ మేకింగ్, స్క్రీన్ ప్లే, పాత్రల చిత్రీకరణ, ఫైట్స్, ఎలివేషన్స్ ఇలా ఒక గ్యాంగ్ స్టర్ సినిమాకు అవసరమైన అన్ని అంశాలకు ఆల్ టైమ్ గైడ్ ఈ చిత్రం.  విడుదలైన మొదటి రోజు మొదటి షో అసలు సందడే చేయని ఈ సినిమా సాయంత్రం ఫస్ట్ షో నాటికి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా లేకపోతే నా సినీ కెరీర్ ఇంత గొప్పగా ఉండేది కాదని నాగ్, నమ్మి తన కొడుకుని ఇచ్చినందుకు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు వర్మ అని ఏఎన్నార్ అంటుంటారు. 

ప్రస్తుతం టాప్ పొజిషన్లో వెలుగొందుతున్న దర్శకులు ఎంతో మంది ఈ శివ సినిమా చూసే సినీ రంగంలోకి అడుగుపెట్టారు.  వర్మ స్ఫూర్తితోనే సినిమాలు ఎలా తీయాలో నేర్చుకున్నారు.  ఇక సినిమా చూసిన కుర్రాళ్ళయితే సైకిల్ చైన్లు, హాకీ స్టిక్కులు పట్టుకుని హీరోయిజం చూపించడంలో శివ స్టైల్ ను ఫాలో అయ్యారు.  ఇన్ని విధాలుగా పరిశ్రమ మీద, ప్రేక్షకుల మీద, మార్కెట్ మీద ఇంతలా ప్రభావం చూపిన ఈ శివ తెలుగు సినీ చరిత్రలో వర్మ బ్రిలియన్సీకి, నాగార్జున ప్రతిభకు ఎప్పటికీ చెరిగిపోని సాక్ష్యంలా నిలిచిపోయింది.