నిద్రిస్తున్న చిన్నారులపై దూసుకెళ్లిన కారు

నిద్రిస్తున్న చిన్నారులపై దూసుకెళ్లిన కారు

బీహర్ లోని పాట్నాలో దారుణం జరిగింది. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఓవర్ స్పీడ్ తో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి పుట్‌పాత్ పైకి వెళ్లింది. అక్కడే నిద్రిస్తున్న చిన్నారులపై నుంచి వెళ్లడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు నుజ్జునుజ్జయ్యింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని డ్రైవర్ ను చితకబాదారు. దెబ్బలకు తాళలేక డ్రైవర్ మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు రాజుకుమార్(11), రోహిత్ కుమార్(13), హలేంద్ర కుమార్(9)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల నష్టపరిహారం ప్రకటించింది.