హిందూసమాజ్ అధ్యక్షుడి హత్యకు అదే కారణమా..!?

హిందూసమాజ్ అధ్యక్షుడి హత్యకు అదే కారణమా..!?

హిందూసమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారీ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దారుణ హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను యూపీ, గుజరాత్ సంయుక్త పోలీసు బృందం ఇవాళ అరెస్టు చేసింది. అయితే, 2015లో కమలేష్ తివారీ ఓ ప్రసంగంలో చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్టు విచారణలో నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తివారీ హత్యకు ఖుర్షీద్ పఠాన్ వ్యూహం పన్నగా, మౌలానా మొహసిన్ ఈ కుట్రను ప్రోత్సహించినట్టు ప్రాథమిక విచారణ తేలిందని పోలీసు అధికారి ఓపీ సింగ్ చెప్పారు. ఈ హత్యతో ఏ ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి రాలేదన్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారాయన. కాగా, నిన్న మధ్యాహ్నం తివారీపై ఆయన నివాసంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తివారీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.