33 సెంచరీలు.. 33 బీర్లు

33 సెంచరీలు.. 33 బీర్లు

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు అనంతరం ఇంగ్లండ్‌ ఓపెనర్ అలిస్టర్‌ కుక్‌ క్రికెట్ కు దూరంగా ఉండనున్నారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ మీడియా ప్రతినిధులు కుక్ కు ఓ కానుకను అందించారు. చివరి టెస్ట్‌లో కుక్ చేసిన సెంచరీ అతనికి 33వ సెంచరీ. దీనికి గుర్తుగా కుక్‌కు మీడియా సమావేశంలో ప్రతినిధులంతా 33 బీర్‌ బాటిళ్లను అందజేశారు. ఒక్కో బాటిల్‌పై ఒక్కో మెసేజ్‌ను రాసి కుక్‌కు అందించారు. కుక్‌ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

నాలుగవ రోజు మ్యాచ్‌ అనంతరం కుక్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కుక్‌ వరుసగా జవాబులిస్తున్నాడు. ఇదే సమయంలో ఒక వ్యక్తి కుక్‌ వద్దకు ఒక బాక్స్ ను పట్టుకుని వెళ్లాడు. 'గత కొన్నేళ్లుగా కెప్టెన్‌గా, ఆటగాడిగా ఇంగ్లాండ్‌ జట్టుకు సేవలందించారు. ఎప్పుడు కూడా ఓర్పుగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. క్రికెట్ కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మీకు మా అందరి తరపున చిన్న కానుక' అని అన్నాడు.

ఇంతకుముందు మీరు ఒకసారి మాట్లాడుతూ 'నేను వైన్‌ తాగను.. బీర్‌ మాత్రమే తీసుకుంటా' అని చెప్పారు. అందుకే మీకు 33 బీర్‌ బాటిళ్లను ఇస్తున్నాం. ఒక్కో బాటిల్‌పై ఒక్కో మీడియాకు చెందిన ప్రతినిధి ప్రత్యేకమైన మెసేజ్‌ రాశారు అని ఆ వ్యక్తి తెలిపాడు. అనంతరం ఆ బాక్స్ ను అందజేశాడు. ఆ తర్వాత కుక్ వారందరితో అందరితో కరచాలనం చేసి ఫొటోలు కూడా దిగారు.