తెలంగాణలో భారీగా తహశీల్దార్‌ ల బదిలీ

తెలంగాణలో భారీగా తహశీల్దార్‌ ల బదిలీ

తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఒకే సారి 378 మంది తహశీల్దార్లను ట్రాన్స్‌ఫర్ చేసింది. జోన్ 5 లో 166 మందిని, జోన్ 6 లో 212 మందిని బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని తిరిగి సొంత జిల్లాలకు పంపుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమను బదిలీ చేయాలంటూ గత కొంతకాలంగా రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. తహశీల్దార్ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ వారిని బదిలీ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కిందటి సంవత్సరం అక్టోబరు 10, ఈ ఏడాది ఫిబ్రవరి 16 తేదీల్లో ఈ తహసిల్దార్లను బదిలీ చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియలు పూర్తగా ముగిసిపోయిన నేపధ్యంలో వీరందరినీ పాత్ర స్థానాలకు బదిలీ చేశారు. వీరందరినీ రేపే తమ జాయినింగ్ రిపోర్ట్‌లను అందించాల్సిందిగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. తహశీల్దార్ల రిపాట్రియేషన్ ప్రొసీడింగ్స్‌ను సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు. ప్రత్యామ్నాయాల కోసం వేచి చూడకుండా తహశీల్దార్లను వెంటనే సొంత జిల్లాలకు రిలీవ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.