టీబీతో ఒకే ఏడాది 4.2 లక్షల మంది మృతి..!

టీబీతో ఒకే ఏడాది 4.2 లక్షల మంది మృతి..!

భారత్‌ను (క్షయవ్యాధి) వెంటాడుతోంది.. గత ఏడాది ఏకంగా టీబీతో 4.2 లక్షల మంది మృతిచెందినట్టు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.. హైదరాబాద్‌లో కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో టీబీ(క్షయ వ్యాధి)పై జరిగిన అవగాహన కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశ్వినికుమార్‌ చౌబేతో పాటు వెంకయ్యనాయుడు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది టీబీతో మరణించారని తెలిపారు. టీబీ మరణాలు.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ లాంటి వ్యాధులతో మృతిచెందేవారి కంటే ఎక్కువగా ఉందన్నారు. ఎయిడ్స్ మరియు మలేరియా కలిసి దేశవ్యాప్తంగా సుమారు 27 లక్షలు మంది ప్రజలు టిబి బారిన పడ్డారని.. వీరిలో దాదాపు 10 లక్షల మంది మృతులకు ఎలాంటి రోగం అనేది నిర్ధారణ కానట్టు తెలిపారు. పిల్లలకు పోషకాహారం అవసరమని నొక్కి చెప్పిన వెంకయ్యనాయుడు.. టీబీ వ్యాక్సిన్ కోసం భారత్ ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించిందని, టీబీ పరిశోధనలో కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో మంచి పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, కొత్త సవాళ్లు కూడా ఒకేసారి వెలువడుతున్నాయన్నారు. 

ఇక, తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఏడాది టీబీతో 12 వేల మంది చనిపోతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి అశ్వినికుమార్‌ చౌబే... ఆరోగ్య కార్యకర్తల స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యుల వరకు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం, అవగాహన పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నా ప్రజల్లో అవగాహన లేదు. 2025 నాటికి భారత్‌ నుంచి టీబీని తరిమికొట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్... ఆరేళ్ల లోపు చిన్నారులకు నెలకు 30 గుడ్లు ఇస్తున్నాం. గర్భిణులకు గుడ్లు, పాలు, 3 విడుతల్లో రూ. 12 వేలు అందిస్తున్నాం. మొబైన్‌ వ్యాన్‌లో ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధిని అంతం చేసే ఉద్దేశ్యంతో 130 దేశాల నుండి 4 వేల మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, ప్రభుత్వ సంస్థలు, న్యాయవాదులు, పౌర సమాజ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సమావేశాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం ప్రారంభించారు.