రూ.441 కోట్లతో సిటీ చుట్టూ 40 చెరువుల అభివృద్ధి-కేటీఆర్

రూ.441 కోట్లతో సిటీ చుట్టూ 40 చెరువుల అభివృద్ధి-కేటీఆర్
హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు లోపల రూ.441 కోట్లతో 40 చెరువులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్... గ్రేటర్ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్న తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి... బోరబండ, మోతీ నగర్ , మూసాపేట్, ఫతేనగర్, బాలానగర్, బేగం పేట్ డివిజన్లలో మొత్తం 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నెక్నాంపూర్ చెరువు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులను మిషన్ మోడ్ లో అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని చెరువుల పునరుద్ధరణకు ఐఏఎస్ భారతిని సీఈవోగా నియమించామన్నారు. తన పర్యటనలో విపక్షాలపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్... తెలంగాణ వస్తే హైదరాబాద్ ఏమైపోతుందోనని కామెంట్ చేశారని... కానీ, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ పేరు వినిపిస్తుందన్నారు. ఎవ్వరు ఊహించని విధంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని... ప్యాక్టరీలు, వ్యవసాయానికి కరెంటు కోతలు లేకుండా చేసిన ఘతన తమ ప్రభుత్వానిదే అన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ అల్లకల్లోం అవుతుందన్న వారికి... అభివృద్ధితో సమాధానం చెబుతున్నామన్న కేటీఆర్... హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో కంపెనీలు వస్తున్నాయని... ఐటీలో దేశంలోనే టాప్‌లో హైదరాబాద్ ఉందన్నారు. ఇక కొత్తగా ఏర్పడబోయే మున్సిపాలిటీలకు వెంటనే టాక్స్‌లు పెంచేబోమని స్పష్టం చేశారు కేటీఆర్.