40 ఏళ్ళ 'శ్రీవారి ముచ్చట్లు'

40 ఏళ్ళ 'శ్రీవారి ముచ్చట్లు'

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కు వీరాభిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు. ఏయన్నార్ సినిమాకు దర్శకత్వం వహించాలన్నది నారాయణరావు విశేషమైన అభిలాష. 1978లో 'దేవదాసు మళ్ళీ పుట్టాడు'తో అక్కినేని, దాసరి తొలిసారి కలసి పనిచేశారు. ఆ సినిమా జనాన్ని రంజింప చేయలేక పోయింది. 1979లో 'రావణుడే రాముడైతే'తో మరోసారి కలిశారు. ఆ చిత్ర ఫలితమూ నిరాశాజనకమే. 1980లో ఏయన్నార్, దాసరి కాంబోలో వచ్చిన 'ఏడంతస్తుల మేడ' మంచి విజయం సాధించింది. తరువాత వీరిద్దరి కాంబోలో అదే యేడాది 'బుచ్చిబాబు' వచ్చింది. ఏయన్నార్ కు 'దసరా బుల్లోడు' (1971) తరువాత మళ్ళీ  ఆ స్థాయి సక్సెస్ దరి చేరలేదు. అలాంటి గ్రాండ్ సక్సెస్ తన అభిమాన హీరోకు అందించాలన్నది దాసరి తపన. ఆ సమయంలో దాసరి రూపొందించిన చిత్రం 'శ్రీవారి ముచ్చట్లు' . ఈ చిత్రం 1981 జనవరి 1న విడుదలయింది. 'శ్రీవారి ముచ్చట్లు' చిత్రానికి ఓ నాటి నటి, నిర్మాత కృష్ణవేణి కూతురు ఎన్.ఆర్. అనురాధాదేవి నిర్మాత. అంతకు ముందు ఏయన్నార్ తో అనురాధాదేవి "చక్రధారి, రావణుడే రాముడైతే" చిత్రాలు నిర్మించారు. రెండూ అంతగా అలరించలేదు. కానీ, ఆమెకు మరో అవకాశం ఇచ్చారు ఏయన్నార్. మూడో ప్రయత్నంలో అనురాధాదేవి ఏయన్నార్ తో తెరకెక్కించిన చిత్రం 'శ్రీవారి ముచ్చట్లు'. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇద్దరమ్మాయిల నడుమ నాయకుడు
'శ్రీవారి ముచ్చట్లు'లో ఇద్దరు హీరోయిన్లు, ఓ నాయకుని మధ్య కథ సాగుతుంది. మరి ఇందులో వింతేముంది? ఆ ఇద్దరు అమ్మాయిలలో రాధ అనే అమ్మాయిని పెళ్ళికి ముందే ప్రేమించి ఉంటాడు హీరో గోపి. కానీ, అనివార్య పరిస్థితుల్లో రాధను చేరుకోలేకపోతాడు. ఆమెకు వేరొకరితో పెళ్ళయిందని తెలుసుకుంటాడు. తనను, తన కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడిన మేనమామ కూతురు ప్రియను పెళ్ళిచేసుకుంటాడు. ప్రియకు డాన్స్ టీచర్ గా రాధ కనిపిస్తుంది. తరువాత ఆమెకు పెళ్ళి  కాలేదన్న నిజం తెలుస్తుంది. అప్పటికే రాధకు గోపీ కారణంగా  ఓ బిడ్డ పుట్టి ఉంటాడు. రాధ, ప్రియ సన్నిహితులవుతారు.  గోపిని, ప్రియను రాధ ఒకటి చేస్తుంది. వారికి కూడా  ఓ బిడ్డ పుడతాడు. ఈ ఇద్దరమ్మాయిలు ఒకరి సుఖం ఒకరు కోరుకొని త్యాగంచేసుకుంటారు. చివరకు ఇద్దరూ చనిపోవడంతో గోపి, తన ఇద్దరు బిడ్డలతో మిగిలిపోతాడు. ఇదీ 'శ్రీవారి ముచ్చట్లు' కథ. 

అలరించిన పాటలు
'శ్రీవారి ముచ్చట్లు'లో గోపిగా ఏయన్నార్, రాధగా జయప్రద, ప్రియగా జయసుధ నటించారు. ఇతర పాత్రల్లో ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, రాజసులోచన, సుకుమారి, కవిత, పి.జె.శర్మ తదితరులు అభినయించారు. 'శ్రీవారి ముచ్చట్లు' చిత్రానికి కథ, మాటలు, పాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు సమకూర్చారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ప్రత్యేక ఆకర్షణ. ఇందులోని పాటలన్నీ జనాన్ని ఆకట్టుకున్నాయి. "ఉదయ కిరణ లేఖలో..." , "ముక్కుపచ్చలారని కాశ్మీరం...",  "ఆకాశం  ముసురేసింది...", "కాళ్ళా  గజ్జా కంకాణమ్మా...", "సూర్యునికొకటే ఉదయం..." , "తూరుపు తెలతెల వారగనే... చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు..."  మొదలయ్యే పాటలు ప్రేక్షకులను రంజింప చేశాయి.  ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. తరువాతి రోజుల్లోనూ అభిమానులను అలరించింది. ఇప్పటికీ బుల్లితెరపై ఫ్యాన్స్ కు పరమానందం పంచుతూ ఉంటుంది.