43కు చేరిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్భ్రాంతి

43కు చేరిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్భ్రాంతి

ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాద మృతుల సంఖ్య క్రమంగా పెరుగూతే ఉంది... అనాజ్‌ మండి ఏరియాలోఉన్న ఓ ఫ్యాక్టరీ భవనంలో ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించేలోపే ఆ మంటలు భవనం మొత్తం అంటుకున్నాయి. కార్మికులు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో కార్మికులు సజీదహనమయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకైన రోడ్డులో ఉండడంతో ప్రమాద బాధితులు వెంటనే తప్పించుకోలేకపోయారు. షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతిచెందారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు... ఇక, ప్రమాదంపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 1997లో ఢిల్లీలోని ఓ సినిమాహాల్‌లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం. నాటి ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ్టి ప్రమాదంలో ఇప్పటికే 43కి చేరుకోగా.. మరికొంత మంది మృతిచెందే అవకాశం ఉందంటున్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్న అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.