హిమాచల్ బస్సు ప్రమాదం, 44కు చేరిన మృతులు

హిమాచల్ బస్సు ప్రమాదం, 44కు చేరిన మృతులు

హిమాచల్‌ప్రదేశ్‌ కులు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 44కి చేరింది. గాయపడ్డ 34 మందిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అనేక మంది బస్సు పైభాగంలో ఉన్నారని అందుకే మృతుల సంఖ్య భారీగా ఉందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

ఒక ప్రైవేట్ బస్సు గురువారం సాయంత్రం కులు జిల్లాలోని బంజర్ నుంచి గడుగుషైనికి బయలుదేరింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొందరు టాప్ పై కూర్చున్నారని స్థానికులు తెలిపారు. సాయంత్రం 4 గంట ల ప్రాంతంలో బస్సు బంజర్ తాలుకాలోని ధోత్‌మోర్ ప్రాంతంలో ఉన్న మూలమలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు 300 మీటర్ల లోతులోకి పడిపోయింది. లోయలో బండరాళ్లపై పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ.50వేల తక్షణ  సాయం ప్రకటించింది. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్, సీఎం జైరామ్ ఠాకూర్  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.