లిచి తిని 48 పిల్లలు మృతి?

లిచి తిని 48 పిల్లలు మృతి?

మరోసారి ఉత్తరాదిలో లిచి పండు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా బీహార్‌ రాష్ట్రంలో ఇటీవల 48 మంది పిల్లలు మరణించారు. వీరంతా పదేళ్ళ లోపు పిల్లలే. వీళ్ళందరూ లిచి పండు ద్వారా సంక్రమించిన వ్యాధి వల్లే మరణించారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్ళుగా బీహార్‌లో లిచి పండ్లు తిని పిల్లలు మరణించడం పరిపాటిగా మారింది. బుధవారం బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను బట్టి చూస్తే పిల్లల మృతికి లిచి పండ్లే కారణమా అన్న అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. పిల్లలకు లిచి పండ్లను పొరకడుపున పెట్టొద్దని బీహార్‌ ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే మాగని, దోరగా ఉన్న లిచి పండ్లను పెట్టొదని హెచ్చరింది. వైద్యులు కూడా హాస్పిటల్‌కు వస్తున్న పిల్లలను పరిశీలిస్తున్నారు. వీరు పొరకడుపున లిచి తిన్నారా లేదా ఉదయం టిఫిన్‌ తినకుండా మానేశారా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పొరకడుపున లేదా పండని లిచి పండ్లను తినడం వల్ల మెదడు వ్యాపు వ్యాధి వస్తోందని వైద్యలు భావిస్తున్నారు. బీహార్‌లో ముఖ్యంగా ముజఫర్‌పూర్‌, పరిసర జిల్లాల్లో లించి చాలా విరివిగా పండుతుంది. తోటలోదొరికే పిల్లలు పొరకడుపున వీటిని తినేస్తుంటారు. అలాగే ఇంకా మాగని పండ్లను అదేపనిగా తినేయడం, టిఫిన్‌ తినకపోవడం వల్ల మెదడు వ్యాపు వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా పౌష్ఠికాహారం లోపించిన పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.