వనపర్తి జిల్లాలో పండగపూట పెను విషాదం

వనపర్తి జిల్లాలో పండగపూట పెను విషాదం

వనపర్తి జిల్లాలో పండగపూట పెను విషాదం జరిగింది. గోపాల్ పేట మండలం బుద్దారంలో మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా మట్టి మిద్దె కూలడంతో అత్త మనెమ్మ, కొడళ్ళు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్ళు వైష్ణవి, పింకి మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మరణించాడు. ఆయన భార్య మణెమ్మ గ్రామంలో నివసిస్తోంది. ఆమె కుమారులు హైదరాబాదులో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో మొన్ననే గ్రామానికి వచ్చారు. శనివారం ఆ కార్యక్రమం ముగిసింది. రాత్రి భోజనాల తర్వాత 9 మంది ఓ గదిలో పడుకున్నారు. ఆ గది పైకప్పు కూలడంతో అందులో పడుకున్న మణెమ్మతో పాటు ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ (40), ఉమాదేవి (35), మనవరాళ్లు వైష్ణవి (14), అక్షయ (12) అక్కడికక్కడే మరణించారు. మూడో కుమారుడు కుమారస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.