మోడీపై మన పసుపు రైతుల పోటీ..!

మోడీపై మన పసుపు రైతుల పోటీ..!

ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మన పసుపు రైతులు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో తొలివిడుతలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసి.. దేశంలో ఎప్పుడూ లేని విధంగా 12 ఈవీఎంలను యూనిట్‌గా పెట్టి పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి సృష్టించిన రైతులు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసి మరింత చర్చను లేవనెత్తాలనుకుంటున్నారు. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పసుపు రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్లనున్నారు రైతులు. వారణాసి లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేయనున్నారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోమని వెల్లడించారు.