తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

తిరుమలలో ఘనంగా  అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

తిరుమలలో అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 518 వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి నేత్ర‌ప‌ర్వంగా ఊంజల్‌సేవ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో తిరుమ‌లగిరులు పుల‌కించాయి. భ‌క్తులు భ‌క్తిసాగ‌రంలో మునిగితేలారు. శ్రీవారి పై అన్నమయ్య రచించిన సంకీర్తనలు సుమధురంగా ఆలపించగా ఆ కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

సన్మానాలు :

అనంతరం అహోబిలం శ్రీవన్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీని టీటీడి ఈవో జవహార్ రెడ్డి  శాలువ,శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అహోబిలం మఠం తరపున టీటీడీ అధికారులను స్వామీజీ సన్మానించారు. అనంతరం టీటీడీ తరపున తాళ్ళపాక వంశీయులను సత్కరించారు. ఈ సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 518 వ వర్ధంతి మహోత్సవాలు తిరుమలతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఆంజనేయస్వామి జన్మస్ధలం తిరుమల కొండే: 

ఆంజనేయస్వామి జన్మస్ధలం తిరుమల కొండేనని టీటీడీ నియమించిన కమిటీ ఆధారాలతో కూడా సేకరించిందని... ఉగాది పర్వదినమైన 13వ తేదిన కమిటీ ఇచ్చిన నివేదికను భక్తుల ముందు ఉంచుతామని...దీని పుస్తక రూపంలో కూడా భక్తులకు అందిస్తామన్నారు. కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూ ప్రమాదకర స్థాయికి చేరడంతో సర్వదర్శనం టోకెన్ల జారీ 11వ తేదీ సాయంత్రం నుంచి రద్దు చేస్తున్నామని...ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి పరిస్థితులకు అనుగుణంగా దర్శనం సంఖ్య కుదించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని జవహర్ రెడ్డి తెలిపారు.